స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఇండోర్‌ స్టేడియం షురూ

3 Jul, 2018 10:18 IST|Sakshi

ప్రారంభించిన రాష్ట్ర క్రీడా మంత్రి పద్మారావు గౌడ్‌  

సాక్షి, హైదరాబాద్‌: హకీంపేట్‌లోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూల్‌ విద్యార్థులకు ఇండోర్‌ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్‌ సోమవారం స్టేడియాన్ని ప్రారంభించారు. కోటి 30 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియం అత్యాధునిక హంగులతో తయారైంది. దీనితో పాటు 3 కోట్ల 70 లక్షల వ్యయంతో నిర్మించిన కాంపౌండ్‌ వాల్‌ను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం జాతీయ స్థాయిలో సత్తా చాటుతోన్న స్పోర్ట్స్‌ స్కూల్‌ విద్యార్థులను సన్మానించారు. భవిష్యత్‌లోనూ రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టేలా క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా రూ. 15 లక్షల విలువ చేసే ట్రాక్‌ సూట్లను క్రీడాకారులకు అందజేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్విమ్మింగ్‌పూల్‌ను స్కూల్‌ ప్రాంగణంలో నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం స్కూల్‌ ప్రాంగణంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ సీహెచ్‌ మల్లారెడ్డి, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, క్రీడా కార్యదర్శి బి. వెంకటేశం, శాట్స్‌ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎండీ దినకర్‌బాబు, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఎం.వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు