CWC 2023 Semi Final: టీమిండియా జోరుకు కివీస్‌ అడ్డుకట్ట వేయగలదా..?

14 Nov, 2023 10:32 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో తొమ్మిది వరుస విజయాలు సాధించి లీగ్‌ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్‌.. బుధవారం జరుగబోయే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇదివరకే (లీగ్‌ దశలో) న్యూజిలాండ్‌ను ఓసారి ఖంగుతినిపించిన భారత్‌ మరో విజయంపై ధీమాగా ఉంది. కివీస్‌ సైతం ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్‌ చేతిలో ఎదురైన పరాభవానికి ‍ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది.

బ్యాటింగ్‌కు స్వర్గధామం..
భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు వేదిక అయిన వాంఖడే మైదానం అనాదిగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తూ వస్తుంది. రేపు జరుగబోయే సెమీస్‌ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్టేడియం చిన్నది కావడంతో బ్యాటర్లు అవలీలగా ఫోర్లు, సిక్సర్లు బాదగలరు. ఈ పిచ్‌పై మరోసారి భారీ స్కోర్‌ నమోదు కావడం ఖాయం. ఇదే పిచ్‌పై శ్రీలంకతో జరిగిన లీగ్‌ దశ మ్యాచ్‌లో భారత్‌ బ్యాటర్లు పేట్రేగిపోయారు. ఆ మ్యాచ్‌లో భారత్‌ 357 పరుగులు చేసి, శ్రీలంకను 55 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఫలితంగా 302 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 

టాస్ అత్యంత కీలకం..
ఈ మ్యాచ్‌లో టాస్‌ కీలకపాత్ర పోషించనుంది. వాంఖడే పిచ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసే జట్టుకు పూర్తి స్థాయిలో అనుకూలించనుండటంతో టాస్‌ గెలిచిన జట్టు తప్పక బ్యాటింగ్‌ ఎంచుకుంటుంది. 

భారత్‌దే పైచేయి..
గతంలో ఇరు జట్ల మధ్యలో జరిగిన మ్యాచ్‌ల్లో జయాపజయాలను పరిశీలిస్తే.. న్యూజిలాండ్‌పై భారత్‌ స్వల్ప ఆధిక్యత కలిగి ఉంది. ఇరు జట్లు గతంలో 117 సందర్భాల్లో ఎదురెదురుపడగా భారత్‌ 59, న్యూజిలాండ్‌ 50 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్‌ టై కాగా.. ఏడు మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిసాయి. 

వరల్డ్‌కప్‌లో కివీస్‌దే ఆధిక్యత..
వరల్డ్‌కప్‌ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు తొమ్మిది సార్లు ఎదురెదురుపడగా.. న్యూజిలాండ్‌ 4, భారత్‌ 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. 

సెమీస్‌లో వరుసగా రెండోసారి..
భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో వరుసగా రెండోసారి తలపడుతున్నాయి. 2019 ఎడిషన్‌లో ఈ ఇరు జట్లు తొలిసారి సెమీఫైనల్లో ఎదురెదురుపడ్డాయి. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ భారత్‌ను 21 పరుగుల తేడాతో ఓడించింది. 

ఇరు జట్ల బలాలు, బలహీనతలు..
ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఫామ్‌ను బట్టి చూస్తే, న్యూజిలాండ్‌ కంటే టీమిండియా చాలా పటిష్టంగా కనిపిస్తుంది. భారత్‌ అన్ని విభాగాల్లో న్యూజిలాండ్‌ కంటే మెరుగ్గా ఉంది. భారత బ్యాటింగ్‌ విభాగంలో ప్రతి ఒక్కరూ సూపర్‌ టచ్‌లో ఉన్నారు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లోనూ టీమిండియాకు తిరుగులేదు. ఓవరాల్‌గా చూస్తే, ప్రస్తుతం భారత్‌ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. జట్టులోని ఆటగాళ్లంతా చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. ఈ ఊపులో భారత్‌ టైటిల్‌ గెలవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

న్యూజిలాండ్‌ విషయానికొస్తే.. టోర్నీ ఆరంభంలో వరుస విజయాలు సాధించి, ఆతర్వాత ఒక్కసారిగా పరాజయాల బాటపట్టిన న్యూజిలాండ్‌, ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచి సెమీస్‌కు చేరింది. అంతంతమాత్రం ప్రదర్శనతో సెమీస్‌కు చేరిన కివీస్‌ను గాయాల సమస్య ప్రధానంగా వేధిస్తుంది. మొన్నటి దాకా కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ జట్టుకు దూరంగా ఉన్నాడు. అతని గైర్హాజరీలోనే న్యూజిలాండ్‌ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది.

సౌతాఫ్రికాతో మ్యాచ్‌ సందర్భంగా స్టార్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ గాయంపాలై, ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించాడు. మరోవైపు ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌ ఇప్పటికీ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. గాయాల బెదడతో పాటు న్యూజిలాండ్‌ను నిలకడలేమి కూడా వేధిస్తుంది. రచిన్‌ రవీంద్ర, అడపాదడపా డారిల్‌ మిచెల్‌ మినహా జట్టులోని ఆటగాళ్లంతా తరుచూ విఫలమవుతున్నారు. వీరిలో విలియమ్సన్‌ కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. బౌలింగ్‌ విభాగం వరకు న్యూజిలాండ్‌ పటిష్టంగా కనిపిస్తుంది. బౌల్ట్‌, ఫెర్గూసన్‌, సాంట్నర్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్‌ కాన్వే వైఫల్యాలు కివీస్‌ను కలవరపెడుతున్నాయి. 


 

మరిన్ని వార్తలు