ఎవరేమనుకున్నా.. ఐ డోంట్‌ కేర్‌ : కోహ్లి

3 Aug, 2018 14:51 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

బర్మింగ్‌హామ్‌ : ఇంగ్లండ్‌ గడ్డపై తొలి శతకం నమోదు చేసిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన ప్రిపరేషన్‌ పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ..‘ జట్టుకు తనవంతు సహకారం అందించాలనే ప్రిపేర్ అయ్యా. అది కేవలం మూడంకెల మార్కు కోసం కాకుండా జట్టు విజయమే లక్ష్యంగా సిద్దమయ్యా. అయితే అనుకున్న లక్ష్యం చేరకుండానే వికెట్‌ సమర్పించుకోవడంతో కొంత నిరాశకు గురయ్యా. నిజానికి 10 నుంచి 15 పరుగుల ఆధిక్యం సాధించాలనే లక్ష్యంతో ఆడాను. కానీ కుదరలేదు. ఇక నా ప్రిపరేషన్‌ పట్ల సంతోషంగా ఉ‍న్నా.. ఎవరు ఎమనుకున్నా నాకు అవసరం లేదు.’ అని తెలిపాడు.

టెయిలండర్లతో రాణించడంపై స్పందిస్తూ.. ‘టెయిలండర్లతో పరుగులు రాబట్టడం ఒత్తిడితో కూడుకున్నపనే. కానీ ఆ క్లిష్ట సమయంలో కష్టమైన పరిస్థితులను కూడా ఆస్వాదించాలని నిర్ణయించుకున్నా. దాన్ని ఓ సవాల్‌గా తీసుకుని ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించా. ఈ పరిస్థితి మానసిక బలానికి పరీక్షే. కానీ ప్రత్యర్థీ స్కోర్‌ను సమీపించాలనే లక్ష్యంతోనే ముందుకు సాగాను. దీనికి టెయిలండర్లు మద్దతిచ్చారు. ముఖ్యంగా ఐదు వికెట్ల అనంతరం వచ్చిన హార్ధిక్‌ అద్భుతంగా ఆడాడు. అలాగే ఇషాంత్‌, ఉమేశ్‌ వారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేశారు. వారి నుంచి ఇది ఓ గొప్ప ప్రదర్శన. వారి ప్రదర్శన పట్ల నేను గర్వంగా ఫీలవుతున్నా. వారి వల్లే ఇది సాధ్యమైంది. మేం ఇక్కడికి గట్టి పోటినివ్వడానికి వచ్చాం. అలా పోరాడుతూనే ఉంటాం’ అని కోహ్లి పేర్కొన్నాడు.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 182 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌ను కోహ్లి (225 బంతుల్లో 149; 22 ఫోర్లు, 1 సిక్స్‌) టెయిలండర్లతో గట్టెక్కించిన విషయం తెలిసిందే. 

చదవండి: దటీజ్‌ కోహ్లి!

>
మరిన్ని వార్తలు