అభ్యర్థులకు ఆహ్వానం

14 Sep, 2016 01:05 IST|Sakshi
అభ్యర్థులకు ఆహ్వానం

 16 నుంచి స్థానిక ఎన్నికలకు దరఖాస్తులు
 ఇతర భాషల్లోకి తమిళ కావ్యాలు
 అన్నాడీఎంకే అధినేత్రి , సీఎం జయలలిత  వెల్లడి

 
 సాక్షి ప్రతినిధి, చెన్నై: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఈనెల 16వ తేదీ నుంచి దరఖాస్తులు సమర్పించుకోవచ్చని అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
 
 రాష్ట్రంలోని స్థానిక సంస్థల పదవీకాలం వచ్చేనెల 24వ తేదీతో ముగుస్తుంది. ఈలోగా స్థానిక ఎన్నికలను పూర్తిచేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఇప్పటికే ప్రారంభించింది. అక్టోబర్ 17, 19 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగలదని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. అన్నాడీఎంకే తరఫున పోటీచేయాలనుకునే వారు జిల్లాల వారీగా తమ దరఖాస్తులను పార్టీ ప్రధాన కార్యాలయంలో అప్పగించవచ్చని మంగళవారం ప్రకటించారు.
 
 16వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరించవచ్చు. భర్తీ చేసిన దరఖాస్తులను ఈనెల 22వ తేదీ రాత్రి 8 గంటల్లోగా పార్టీ కార్యాలయంలో అప్పగించాలి. స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ కమిటీని సీఎం నియమించారు. మంత్రి పన్నీర్ సెల్వం, పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ తంబిదురై, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్  పొల్లాచ్చి జయరామన్, ఎమ్మెల్యే సెమ్మలై, పార్లమెంటు పార్టీ సభాపక్ష నేత డాక్టర్ వేణుగోపాల్ కమిటీలో ఉన్నారు.
 
 ఇతర భాషల్లోకి తిరుక్కురల్ అనువాదం:  మహాకవి తిరువళ్లువర్ రచించిన తిరుక్కురల్, మహాకవి భారతియార్ రచించిన పాటలు, విప్లవకవి భారతిదాసన్ పాటలను చైనా, అరబ్ భాషల్లోకి అనువదించేలా ఆదేశించినట్లు సీఎం జయలలిత తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మరికొన్న గ్రంథాలు సైతం ప్రపంచ భాషలైన ఫ్రాన్స్, జర్మన్, దేశీయ భాషలైన మలయాళం, తెలుగు, హందీ భాషల్లోకి సైతం అనువదిస్తున్నామని చెప్పారు. ఈ గ్రంథాల అనువాదాల వల్ల తమిళ రచనల్లోని మాధుర్యం ప్రపంచ దేశాలకు చెప్పినట్లు అవుతుందని ఆమె అన్నారు.
 

మరిన్ని వార్తలు