షూటింగ్ లేనప్పుడు దొంగతనాలు చేస్తుంటాడు!

23 Feb, 2016 23:07 IST|Sakshi
షూటింగ్ లేనప్పుడు దొంగతనాలు చేస్తుంటాడు!

చెన్నై: నకిలీ ఆర్‌టీవో కార్యాలయాన్ని నడుపుతున్న నానుమ్ రౌడీదాన్ చిత్ర నటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెన్‌కాశీ సమీపంలో నిరామపేట దక్షిణ వీధికి చెందిన శంకరపాండియన్ 2013 అక్టోబర్ 13వ తేదీన తెన్‌కాశీ బస్టాండ్ బైక్ పార్కింగ్‌లో మోటార్ బైక్‌ను పార్క్ చేసి వెళ్లారు.తిరిగి వచ్చి చూడగా బైక్ కనిపించలేదు. దీని గురించి అతను తెన్‌కాశీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు ఆదివారం తెన్‌కాశీ ఆయ్‌కుడి ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.ఆ సమయంలో బైకులో అటుగా వస్తున్న ఇద్దరు యువకుల్ని నిలిపి విచారించారు. వారి బైక్‌లో ఆర్‌టీవో కార్యాలయ రసీదులు ఉండడం గమనించారు. వాళ్లను విచారించగా వాళ్లు నడుపుతున్న ఆ బైక్ దొంగతనానికి గురైన శంకరపాండియన్ బైక్ అని తెలిసింది.

ఈ ఇద్దరిలో ఒకరు తెన్‌కాశీ హౌసింగ్ బోర్డు నివాసి పన్నీర్‌సెల్వం కొడుకు సురేష్(25)అని, రెండో వ్యక్తి కడైయనల్లూర్, కృష్ణపురానికి చెందిన ఇనియభారత్ అని తెలిసింది. బీబీఏ పట్టాదారి అయిన సురేష్ నటుడిగా పలు చిత్రాల్లో నటిస్తున్నట్లు, ఇటీవల నాను మ్ రౌడీదాన్ చిత్రంలో పోలీస్ పాత్రలో నటించినట్లు తెలిసింది.  షూటింగ్ లేని సమయాల్లో తెన్‌కాశీ వచ్చి ఇనియ భారత్‌తో కలిసి దొంగతనాలకు పాల్పడుతుండేవాడు. నకిలీ ఆర్‌టీవో కార్యాలయాన్ని నడుపుతూ నకిలీ బైక్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో వారిద్దరినీ అరెస్ట్ చేసి తదుపరి విచారణ ప్రారంభించినట్లు పోలీసులు వివరించారు.

మరిన్ని వార్తలు