హోదాపై భగ్గుమన్న ఏపీ...బంద్ సంపూర్ణం

10 Sep, 2016 12:07 IST|Sakshi
హోదాపై భగ్గుమన్న ఏపీ...బంద్ సంపూర్ణం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఐదున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష, ఆశయం ప్రత్యేక హోదానేనని వైఎస్సార్సీపీ నేతలు గళమెత్తారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లు, ప్రధాన కూడళ్ల వద్ద నాయకులు బైఠాయించి హోదాపై నినాదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేసి తమ నిరసనను తెలియజేశారు. బంద్‌ను అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కారు ఎక్కడికక్కడే నేతలను నిర్బంధిస్తోంది. ఈ బంద్కు కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు తెలపడంతో పాటు బంద్లో పాల్గొన్నాయి.
 
వైఎస్సార్ జిల్లా: ఏపీకి ప్రత్యేక హోదా కోసం శనివారం బంద్‌ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు పోరుబాటపట్టారు. పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. జమ్మలమడుగులో డా.సుధీర్ రెడ్డి,  కడపలో మేయర్ సురేష్ బాబు, రాజంపేటలో పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి  నేతృత్వంలో పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు బంద్లో పాల్గొన్నారు. ఉదయాన్నే రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు. బాబు  స్వార్థ ప్రయోజనాల వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రావడం లేదని నేతలు మండిపడ్డారు. బంద్కు జర్నలిస్టు సంఘాలు మద్దతు తెలపడంతో పాటు బంద్లో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.  
 
శ్రీకాకుళం: జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్మాన ప్రసాద రావు, తమ్మినేని సీతారాం, శాంతి రెడ్డి లను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పోరాడుతున్న వారిని హౌస్ అరెస్ట్ చేసి ఉద్యమాన్ని అణిచివేయలేరని రెడ్డిశాంతి స్పష్టం చేశారు. సొంత ప్రయోజనాల కోసం ఆంధ్రుల హక్కును చంద్రబాబు తాకట్టు పెట్టాడని వైఎస్సార్ సీపీ నేత ధర్మాన దుయ్యబట్టారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. స్కూళ్లు, కాలేజీలు సెలవు ప్రకటించాయి.
 
విజయనగరం: ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ ఇచ్చిన బంద్‌ పిలుపుతో జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉదయాన్నే నేతలు రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహించారు. విజయనగరంలోని బస్‌ డిపోల ముందు ఆందోళన నిర్వహించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. జిల్లాలో అర్థరాత్రి నుంచే అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు వామపక్షాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
విశాఖపట్టణం: జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్ డిపోల వద్ద నేతలు తెల్లవారుజాము నుంచే బైఠాయించడంతో బస్సులు బయటకు రాలేదు. వైఎస్సార్సీపీ నేత గొల్ల బాబురావు ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పోరాడుతున్న వారిని హౌస్ అరెస్ట్లు చేసి ఉద్యమాన్ని అణిచివేయలేరన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు.
 
తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కోరుకుండలో జక్కంపూడి విజయలక్ష్మీ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలతో పాటు ప్రజా సంఘాలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో బంద్లో పాల్గొని హోదాపై గళమెత్తారు. 
 
పశ్చిమగోదావరి: ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా బంద్ కొనసాగుతోంది. బస్‌ డిపోల ముందు ఆందోళన నిర్వహించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఏలూరులో పార్టీ జిల్లా అధ్యకుడు ఆళ్ల నాని, తణకులో కారుమూరి నాగేశ్వరరావు, నర్సాపురంలో ముదునూరు ప్రసాదరాజు, కొవ్వూరులో తానేటి వనిత, జీలుగుమిల్లిలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నేతృత్వంలో బంద్ నిర్వహిస్తున్నారు. జిల్లాలో అర్థరాత్రి నుంచే అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
కృష్ణాజిల్లా: ప్రత్యేకహోదా కోసం తలపెట్టిన బంద్‌ కృష్ణా జిల్లాలో సంపూర్ణంగా జరుగుతోంది. వర్తక, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. పాఠశాలలకు ముందస్తుగా సెలవు ప్రకటించాయి. హోదా కోసం బైక్ ర్యాలీ చేస్తున్న వైస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాను పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడలో రాస్తారోకో నిర్వహిస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా విజయవాడ బస్టాండ్‌ ఎదుట ఆందోళన చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ, వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 
గుంటూరు: జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. గుంటూరులో పార్టీ నేతలు మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళగిరిలో జోరువానలోనూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినాదించారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడిక్కడే అరెస్ట్లు చేశారు. 
 
ప్రకాశం: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఒంగోలు ఎంపీ వై.వి సుబ్బారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో.. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హోదా కోసం ధర్నా చేస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని సంతమాగులూరులో పోలీసులు అరెస్ట్ చేసి కురిచేడుకు స్టేషన్ కు తరలించారు. జిల్లాలోని అన్ని బస్‌ డిపోల ముందు నేతలు ఆందోళనకు దిగారు. చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం ఏపీకి తాకట్టు పెట్టారని నేతలు దుయ్యబెట్టారు
.
నెల్లూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా వైఎస్ జగన్ ఇచ్చిన బంద్‌ పిలుపుతో జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నాయి. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. చంద్రబాబు తీరు వల్లే ప్రత్యేక హోదా రావడం లేదని నేతలు నినాదించారు.   
 
చిత్తూరు: చిత్తూరుజిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఇతర పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. భూమన అరెస్ట్కు నిరసనగా కార్యకర్తలు నిరసనగా దిగారు. జిల్లాలో 144 సెక్షన్‌తో పాటు సెక్షన్‌ 30 అమలు చేస్తున్నారు. హైవేను దిగ్భంధించిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలమనేరు, జంగాలపల్లిలో బంద్‌ నిర్వహిస్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ను అడ్డుకునేందుకు, అరెస్టులను పర్యవేక్షించడానికి డీఎస్పీ స్థాయి అధికారిని నియమించడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  
 
అనంతపురం : ప్రత్యేక హోదా కోసం వైస్ జగన్ పిలుపు మేరకు శనివారం బంద్‌ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు బంద్లో పాల్గొన్నారు. అనంతపురంలో గుర్నాథ్ నేతృత్వంలో, గుంతకల్లులో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నేతలు బంద్ను నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారు జాము నుంచే నేతలు రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు. బాబు తీరుపై నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 
 
కర్నూలు: జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ ఎంపీ బుట్టా రేణుక నేతృత్వంలో బంద్ చేపట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నేతలు నినాదించారు. హోదా సాధించేవరకు వైఎస్సార్ సీపీ పోరాటం కొనసాగిస్తోందని తెలిపారు. అర్థరాత్రి నుంచే బస్‌ డిపోల ముందు ఆందోళన నిర్వహించి బస్సులు బయటకు రాకుండా నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోదాపై నినాదించారు. 
 
 
 
మరిన్ని వార్తలు