పుణే కంటోన్మెంట్‌లో బీజేపీకి రెండు, కాంగ్రెస్‌కు ఒకటి

12 Jan, 2015 23:44 IST|Sakshi

పింప్రి, న్యూస్‌లైన్ : పుణే కంటోన్మెంట్‌కు ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో బీజేపీ రెండు, కాంగ్రెస్ ఒక బోర్డును కైవసం చేసుకున్నాయి. పుణే, దేహూరోడ్ కంటోన్మెంట్‌లలో బీజేపీ గెలుపొందగా, ఖడికి కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది.
 
పుణే కంటోన్మెంట్...
పుణే కంటోన్మెంట్‌లోని ఎనిమిది వార్డులలో బీజేపీ అభ్యర్థులు ఐదింటిలో గెలవగా కాంగ్రెస్-2, స్వతంత్ర అభ్యర్థి ఒక్కటి గెలుచుకున్నారు. ఎన్సీపీ, శివసేనలకు ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఒకటవ వార్డు నుంచి రూపాలీ శైలేంద్ర బిడ్కర్ (ఇండిపెండెంట్) తన సమీప బీజేపీ అభ్యర్థి అనితా సోన్‌టక్కెను ఓడించారు. రెండో వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ పవార్, 3వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి దిలీప్ గింమకర్  గెలుపొందారు.

4వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి అతుల్ గైక్వాడ్ కాంగ్రెస్ అభ్యర్థి కరణ్‌ను ఓడించారు. 5వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి వివేక్ యాదవ్ (తెలుగు వ్యక్తి) బోర్డు మాజీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ అభ్యర్థి హారతి మహాజన్‌ను ఓడించారు. 6వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్తి మథురావాలా తన బీజేపీ ప్రత్యర్థి సచిన్‌ను ఓడించారు. 8వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి ప్రియాంక తన కాంగ్రెస్ ప్రత్యర్థి సావీరా షేక్‌ను ఓడించారు.
 
ఖడికి కంటోన్మెంట్...
ఖడికి కంటోన్మెంట్‌లో మొత్తం ఎనిమిది స్థానాలకు గాను కాంగ్రెస్-5, బీజేపీ-1, ఇండిపెండెంట్లు-2 స్థానాలను గెలుచుకున్నారు. ఒకటో వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కాంబ్లే ఎన్సీపీకి చెందిన విశాల్ గైక్వాడ్‌ను, 2వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ భాస్కర్, బీజేపీకి చెందిన అనిల్ మెహతాను, 3వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మనీష్ ఆనంద్ ఎన్సీపీకి చెందిన మావులి యాదవ్‌ను ఓడించారు.

ఇక 4వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పూజా మనీష్ ఆనంద్ బీజేపీకి చెందిన కిరణ్ త్యాగీపై, 5వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి కార్తీక్ పవర్‌కర్ ఇండిపెండెంట్ అభ్యర్థి సంతోషీ వేణుగోపాల్‌పై గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థులు వైశాలీ వహిల్యాగ్ 6వ వార్డు నుంచి, దుర్యోధన్ బాప్కర్ 7వ వార్డు నుంచి విజయం సాధించారు. 8వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అభయ్ సావంత్.. బీజేపీ అభ్యర్థి రూపేష్ సోరటిను ఓడించారు.
 
దేహూరోడ్ కంటోన్మెంట్...
దేహూరోడ్ కంటోన్మెంట్‌లో ఉన్న ఏడు స్థానాలలో నాలుగు బీజేపీ గెలుచుకోగా, కాంగ్రెస్-2, స్వతంత్రులు ఒకటి గెలుచుకున్నారు. ఒకటవ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి (బీజేపీ రెబల్) రఘువీర్‌శేలార్ తన బీజేపీ ప్రత్యర్థి మామాజీ శేలార్‌ను ఓడించారు, 2వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి సారికా నాయిక్‌నవరే, 3వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి హాజీమలుంగ్ మరి ముత్తుపై గెలుపొందారు. 4వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గోపాల్ ఆంతర్‌పాలే స్వతంత్ర అభ్యర్థి కృష్ణ వీరన్‌ను, 5వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి ఖండేల్‌వాల్ స్వతంత్ర అభ్యర్థి అంథోని స్వామిని ఓడించారు.

మరిన్ని వార్తలు