ప్రజల ఆస్తుల్ని గుంజుకోవడానికి కేసీఆర్ పోటీ.. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి

14 Nov, 2023 15:16 IST|Sakshi

జనగాం: ప్రజల ఆస్తుల్ని గుంజుకోవడానికి కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఓట్లన్నీ డబ్బాలో వేస్తే కేసీఆర్ మూటగట్టుకుని పోతారని అన్నారు. కేసీఆర్ చుట్టాలొచ్చి కామారెడ్డిలో భూములు గుంజుకుంటారని ఆరోపించారు.

కేసీఆర్‌ను తరిమికొట్టడానికే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నానని రేవంత్ తెలిపారు. కేసీఆర్‌ను వెంటాడటానికే కాంగ్రెస్ అధిష్ఠానం తనను పంపించిందని పేర్కొన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఈ మేరకు బీఆర్ఎస్‌పై నిప్పులు చేరిగారు.  

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో మాట్లాడుతూ..
కేసీఆర్‌ను బీఆర్‌ఎస్ నాయకులే నమ్మడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మంత్రివర్గంలో దళితులకు స్థానం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో బందీ అయ్యిందని ఆవేదన వ్యకం చేశారు. కేసీఆర్ లాంటి దోపిడీదారు దేశంలోనే లేరని దుయ్యబట్టారు. పదేళ్లపాటు బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రానికి ఏం చేశారని మూడోసారి అధికారం ఇవ్వమని కేసీఆర్ అడుగుతున్నారని దుయ్యబట్టారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ విజయ భేరీ సభలో ఈ మేరకు రేవంత్ రెడ్డి మాట్లాడారు.

బీఆర్‌ఎస్‌లో ఆరుగురు మహిళలకు టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ 12 మందికి అవకాశం కల్పించిందని రేవంత్ చెప్పారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు మహిళలకు మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళా సాధికారత ఉన్న చోటే అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. వైన్ షాపులు పెట్టి పేదల ఆస్తులను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ప్రజల సంపదను సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. 

స్టేషన్ ఘన్‌పూర్‌కు డిగ్రీ కాలేజీ తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఘన్‌పూర్‌కు 100 పడకల ఆస్పత్రిని తీసుకురాలేకపోయారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బెల్టు షాపులు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేసిన రేవంత్‌.. రాష్ట్రం ఎందులో మొదటి స్థానంలో ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: దయాకర్‌ గెలిస్తే రైతు బంధు రూ. 16వేలు.. పాలకుర్తి బీఆర్‌ఎస్‌ సభలో కేసీఆర్‌

మరిన్ని వార్తలు