కేన్సర్ ఆస్పత్రికి పచ్చజెండా

16 Nov, 2013 23:20 IST|Sakshi

 సాక్షి, ముంబై:   నగరంలోని రే రోడ్డులో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కేన్సర్ ఆస్పత్రిని నెలకొల్పనుంది. ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించనున్న ఈ ఆస్పత్రిని అత్యంత ఆధునిక వసతులతో నిర్మించనున్నారు. కేన్సర్ రోగుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. కానీ చికిత్స కోసం సామాన్య ప్రజలకు ఒక్క టాటా ఆస్పత్రి మాత్రమే అందుబాటులో ఉంది. దీని వల్ల వారు అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో సామాన్య ప్రజల సౌకర్యార్థం రే రోడ్డులో పాడుపడ్డ ఆస్పత్రి స్థలంలో కేన్సర్ ఆస్పత్రి నిర్మించాలని కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ ఆస్పత్రిలో 20 శాతం రోగులకు కార్పొరేషన్ ధరపై చికిత్స అందిస్తారు. మిగతా 80 శాతం రోగులకు ప్రైవేట్ ఆస్పత్రుల కంటే తక్కువ ధర (సెమీ ప్రైవేట్)కు చికిత్స అందించాలని ప్రతిపాదించినట్లు కార్పొరేషన్ అధికారి సంతోష్ ముజుమ్దార్ తెలిపారు.


 అంధేరి-మరోల్‌లో బీఎంసీకి చెందిన కేన్సర్ ఆస్పత్రి కొన్నేళ్ల కిందట మూతపడింది. ఇక ఉపనగరాల్లోని ఆస్పత్రుల్లో కేన్సర్ రోగుల కోసం రిజర్వు చేసిన బెడ్లు ఉన్నాయి. అలాగే  ప్రస్తుతం సెవెన్ హిల్స్ ఆస్పత్రి ఉన్న స్థలంలో గతంలో బీఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కేన్సర్ ఆస్పత్రిని నిర్మించారు. కానీ అనివార్య కారణాల వల్ల దానిని ప్రారంభించకముందే కూల్చి వేయాల్సి వచ్చింది. ఆ ప్రదేశంలో తర్వాత ఐదు నక్షత్రాల సెవెన్ హిల్స్ ఆస్పత్రిని నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే పెరుగుతున్న కేన్సర్ రోగుల సంఖ్య కారణంగా పేద రోగుల నుంచి టాటా ఆస్పత్రి, బీఎంసీ ప్రధాన ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా టాటా ఆస్పత్రిలో వచ్చే కేన్సర్ రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. చికిత్స కోసం రోగులు క్యూ కడుతున్నారు.
 అనేక సార్లు రోగులు రాత్రి సమయాల్లో ఆస్పత్రి బయట గడపాల్సి వస్తోంది. ఈ సమస్యను దూరం చేయాలంటే ప్రత్యేక కేన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేయాల్సిందేనని బీఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు రే రోడ్డులో ఉన్న బీఎంసీకి చెందిన పాడుపడ్డ ఆస్పత్రిని తొలగించి, ఆ స్థలంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో కేన్సర్ ఆస్పత్రి నెలకొల్పాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తవ్వగానే త్వరలో ఆస్పత్రి ప్రతిపాదన స్థాయీ సమితి ముందుకు వెళ్తుందని బీఎంసీ వర్గాలు తెలిపాయి.
 80 పడకల ఆస్పత్రి..
 ఆస్పత్రిలో మొత్తం 80 పడకలు ఉంటాయి. వాటిపై కేవలం కేన్సర్ రోగులకు మాత్రమే చికిత్స అందిస్తారు. టాటా ఆస్పత్రిలో లాగే ఇక్కడ కూడా అత్యాధునిక చికిత్స లభించనుండటంతో రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు