CWC 2023: అది వాడిన పిచ్‌.. అయినా సరే! వాళ్లు అద్భుతం: విలియమ్సన్‌

16 Nov, 2023 17:17 IST|Sakshi

ICC WC 2023 1st semis- India beat NZ: వన్డే వరల్డ్‌కప్‌-2023 తొలి సెమీ ఫైనల్‌ సందర్భంగా ‘పిచ్‌ మార్పు’పై చెలరేగిన వివాదంపై న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ స్పందించాడు. అది వాడిన పిచ్‌ అని పునర్ఘాటించిన కేన్‌.. తమకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. ఇప్పటికే వినియోగించిన పిచ్‌ అయినప్పటికీ చాలా బాగుందని కితాబునిచ్చాడు.

కాగా తొలి సెమీస్‌లో టీమిండయా- న్యూజిలాండ్‌ ముంబైలోని వాంఖడే వేదికగా బుధవారం తలపడిన విషయం తెలిసిందే. టాస్‌ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసింది. శుబ్‌మన్‌ గిల్‌(80-నాటౌట్‌), విరాట్‌ కోహ్లి(117), శ్రేయస్‌ అయ్యర్‌(105) అద్భుత ఇన్నింగ్స్‌తో మెరవగా.. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది.

ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు పోరాడిన న్యూజిలాండ్‌ 327 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో 70 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇదిలా ఉంటే.. వాంఖడే పిచ్‌ను ఆఖరి నిమిషంలో మార్చి భారత జట్టుకు అనుకూలం చేశారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ విషయంపై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి.. ఇలాంటి టోర్నీల్లో పిచ్‌ మార్పు సర్వసాధారణమని స్పష్టం చేసింది. వాంఖడే క్యూరేటర్‌ సిఫారసు మేరకు.. ఐసీసీ స్వతంత్ర పిచ్‌ సలహాదారుతో సంప్రదించిన తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 

ఈ క్రమంలో కేన్‌ విలియమ్సన్‌ సైతం ఈ వివాదం నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశాడు.  ‘‘అది ఇది వరకు వాడిన పిచ్‌. కానీ చాలా బాగుంది. మ్యాచ్‌ తొలి అర్ధ భాగంలో టీమిండియా చాలా బాగా బ్యాటింగ్‌ చేసింది. అయినా.. పరిస్థితులకు అనుగుణంగా పిచ్‌ మార్పులు జరుగుతూనే ఉంటాయి.

అందులో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. భారత జట్టు చాలా బాగా ఆడింది. అయినా ఆఖరి వరకు మేము పోరాడి ఓడిపోయాం. అయితే, మేటి జట్టుకు మాత్రం గట్టి పోటీనివ్వగలిగాం. ప్రపంచంలోనే టీమిండియా అత్యుత్తమ జట్టు. ప్రస్తుతం వాళ్లు ఉత్తమ దశలో ఉన్నారు’’ అని విలియమ్సన్‌ పిచ్ మార్పు వివాదాన్ని కొట్టిపారేశాడు. 

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు