తల్లీకూతుళ్ల హత్య

20 Apr, 2016 02:21 IST|Sakshi

టీనగర్: కుండ్రత్తూరులో మంగళవారం తల్లీ కూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. వారి ఇంటి నుంచి హంతకులు 50 సవర్ల బంగారు నగలు, నగదు దోచుకున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించింది. కాంచీపురం జిల్లా, కుండ్రత్తూరు సమీపానగల బెస్లీగార్డెన్ ప్రాంతానికి చెందిన మహిళ వసంత (64). ఈమె కుమార్తె తేన్‌మొళి (32). కుండ్రత్తూరు ప్రాంతంలోగల ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తూ వచ్చింది.

 తేన్‌మొళికి సురభిశ్రీ (7), గుణశ్రీ ( 9 నెలలు) అనే ఇద్దరు కుమార్తెలున్నారు. తేన్‌మొళి భర్త రామసామి (40). యెమన్ దేశంలో ఇంజినీరుగా పనిచేస్తున్నారు. గత మూడేళ్ల క్రితం బెస్లీ గార్టెన్‌లో ఇల్లు నిర్మించి అందులో కుటుంబీకులు నివశిస్తున్నారు. ఇలావుండగా మంగళవారం ఉదయం 6.30 గంటలకు సురభిశ్రీ, గొంతుపై కత్తిగాయంతోపాటు ఏడుస్తూ గుణశ్రీతోపాటు పక్కింటికి వెళ్లింది. దీన్ని గ మనించిన వారు దిగ్భ్రాంతి చెందారు.

వారు ఏమయ్యిందని ప్రశ్నించగా ఎవరో తమ అమ్మమ్మను, అమ్మను చంపేశారని సురభిశ్రీ ఏడుస్తూ చెప్పింది. వారు వెంటనే సురభిశ్రీని పోరూరులోగల ప్రైవేటు ఆస్పత్రికి పంపారు. ఇంట్లోకి వెళ్లి చూడగా తల్లికూతుళ్లు కత్తిపోట్లకు గురై నిర్జీవంగా కనిపించారు. బీరువా పగులగొట్టి వుంది. దీనిగురించి వెంటనే కుండ్రత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. అంబత్తూరు డిప్యూటీ కమిషనర్ సుధాకర్, పూందమల్లి అసిస్టెంట్ కమిషనర్ అయ్యప్పన్ ఇతర పోలీసులు సంఘటనా స్థలం చేరుకున్నారు.

వసంత, తేన్‌మొళి మృతదేహాలను పోస్టుమార్టం కోసం కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. పోలీసు క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. పోలీసు జాగిలం జూలి హత్యాప్రదేశం నుంచి పరుగెత్తుకుని వెళ్లి నిర్మాణంలోవున్న ఒక భవనం వద్దకు వెళ్లి ఆగిపోయింది. అక్కడ అనేక భవనాలు నిర్మాణంలో వున్నాయి. ఇక్కడ అనేక మంది ఉత్తర దేశస్తులు బసచేసి పనిచేస్తున్నారు. వీరిపై పోలీసులకు అనుమానం వేసింది.  పోలీసుల ప్రాథమిక విచారణలో భార్యభర్తలను పోలిన ఇద్దరు మంగళవారం ఉదయం వసంత ఇంటికి వచ్చారు. వారు ఈ హత్యలు చేసి వుండొచ్చని భావిస్తున్నారు. దీనిగురించి తీవ్ర విచారణ జరుపుతున్నారు. ఇంట్లో 50 సవర్ల నగలు, నగదు చోరీ అయినట్లు భావిస్తున్నారు. దీనిగురించి విదేశంలో వున్న రామసామికి సమాచారం తెలిపారు.
 
 ఇద్దరు మహిళల హత్య:
 కోవిల్‌పట్టి సమీపాన ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి బోస్‌నగర్‌కు చెందిన దంపతులు కరుప్పసామి (55), షణ్ముగత్తాయ్ (52). వీరి కుమారులు మాణిక్కరాజా (30), సముద్రపాండి (28). కొన్నేళ్ల క్రితం కరుప్పసామి హత్యకు గురయ్యారు. ఈ కారణంగా అదే వీథికి చెందిన సుందరరాజ్ కుటుంబీకులతో పాతకక్షలు వున్నాయి. సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు షణ్ముగత్తాయ్ ఇంటి తలుపు తట్టారు. షణ్ముగత్తాయ్ తలుపులు తెరవగానే ఆమె కుమారుడు సముద్రపాండి ఎక్కడ? అని ప్రశ్నించారు.

అందుకామె బయటికి వెళ్లాడని చెప్పగా ఆగ్రహించిన ముఠా కత్తులతో దాడి చేయ గా షణ్ముగత్తాయ్ రక్తపు మడుగులో కిందపడి మృతి చెందింది. తర్వాత ఇంటికి చేరుకున్న సమద్రపాండి తల్లి మృతిచెంది వుండడం చూసి బిగ్గరగా రోదించా డు. సుందరరాజ్ కుటుంబీకులు హత్య చేసి వుంటారని భావించిన సముద్రపాండి నేరుగా వారి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇంట్లో వున్న సుందరరాజ్ భార్య సెల్లత్తాయ్ (48) పై కత్తితో దాడి చేశాడు.

సెల్లత్తాయ్ సంఘటనా స్థలంలోనే విలవిలలాడి మృతిచెందింది. తూత్తుకుడి ఎస్‌పి అశ్విన్ కొట్నీస్, కోవిల్‌పట్టి పోలీసు లు ఘటనా ప్రాంతానికి చేరుకుని ఇరువురి మృతదేహాలను కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. దీనిగురించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆస్తుల వివాదం కారణంగా ఈ హత్యలు జరిగినట్లు తెలిసింది. ఈ జంట హత్యలకు సంబంధించి తండ్రి, కుమారులతో సహా నలుగురు పరారీలో వున్నారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
 
 కార్మికుడి హత్య:
 హోటల్ కార్మికుల మధ్య జరిగిన తగాదాలో ఒకరు హత్యకు గురయ్యారు. హంతకుని ట్రిప్లికేన్ పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. శివగంగై జిల్లా, దేవకోట్టైకు చెందిన వ్యక్తులు ఆరుముగం (52), మురుగానందం (40). ఇరువురూ చెన్నై, చేపాక్కం అక్బర్ హుసేన్ వీథిలోగల ఒక హోటల్‌లో బసచేసి పనిచేస్తున్నారు.

 సోమవారం రాత్రి ఇరువురూ కూరగాయలు తరుగుతుండగా వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన మురుగానందం సమీపానగల కూరగాయల కత్తిని తసుకుని ఆరుముగంపై విసిరాడు. దీంతో అతనికి చేతిలో గాయం ఏర్పడింది. ఇలావుండగా సమాపాన వున్న వారు ఇరువురిని సమాధాన పరచి పంపివేశారు.

అయినప్పటికీ కోపోద్రిక్తుడైన మురుగానందం మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఆరుముగం వుంటున్న గదికి వెళ్లి గొంతుపిసికి చంపాడు. సమాచారం అందుకున్న ట్రిప్లికేన్ పోలీసులు సంఘటనా స్థలం చేరుకుని ఆరుముగం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత పోస్టుమార్టం కోసం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. పోలీసులు మంగళవారం ఉదయం మురుగానందంను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో సంచలనం ఏర్పడింది.

మరిన్ని వార్తలు