కావేరి మండలి వదు

11 Jun, 2014 03:20 IST|Sakshi
కావేరి మండలి వదు

 సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కర్ణాటక ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా కావేరి నిర్వహణా మండలిని ఏర్పాటు చేయవద్దని అఖిల పక్షం ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసింది. కావేరి జల వివాదంపై సుప్రీం కోర్టులో వివిధ వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్న దశలో, ఇలాంటి ప్రతిపాదనల వల్ల అయోమయం తప్ప ఎలాంటి ప్రయోజనమూ ఉండబోదని తెలిపింది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కావేరి నిర్వహణా మండలి ప్రస్తావన లేకుండా చూడాలని డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వంలో మంగళవారం పార్లమెంట్ భవన్‌లో అఖిల పక్షం ప్రధానిని కలుసుకుంది. ఈ సమావేశంలో రాష్ట్రం వాదనలను ఆలకించిన ప్రధాని, సానుకూలంగా స్పందించారని తెలిసింది.

అనంతరం విలేకరులతో సీఎం మాట్లాడుతూ...  ఈ వ్యవహారం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒత్తిడి మేరకు మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కావేరి నిర్వహణా మండలిని ఏర్పాటు చేయరాదని డిమాండ్ చేశారు. అంతకు ముందు కర్ణాటక భవన్‌లో అఖిల పక్షం సభ్యులకు ఆయన అల్పాహార విందునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావేరి నిర్వహణా మండలి ఏర్పాటును సుప్రీం కోర్టులో ఇదివరకే సవాలు చేశామని, ఈ వ్యాజ్యాన్ని...కావేరి ట్రిబ్యునల్ తుది తీర్పును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లతో కలిపి విచారణ చేపట్టనుందని వివరించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకు మండలి ఏర్పాటు దిశగా కేంద్రం చర్యలు చేపట్టినట్లు వార్తలొస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈవిషయంలో న్యాయపరమైన అంశాల గురించి ప్రధానికి సలహాలు ఇవ్వాలని సూచించారు. బోర్డు ఏర్పాటుపై యూపీఏ హయాంలోనే కేబినెట్ నోట్ తయారైందని బీజేపీ ఎంపీలు చెబుతుండడంపై ఆయన స్పందిస్తూ, ఎవరి హయాంలో రూపొందినా దానిని నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. జేడీఎస్ నాయకుడు ఎంసీ. నాణయ్య మాట్లాడుతూ సుప్రీం కోర్టులో వ్యాజ్యం ఉన్నప్పుడు కావేరి నిర్వహణా మండలిని ఏర్పాటు చేయాలన్న కేంద్రం ఆదేశాలు తొందరపాటు చర్య అవుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ఎంపీలు, రాష్ట్రంలో ఉభయ సభల్లోని వివిధ పక్షాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు