'చంద్రబాబుకు కమీషన్లు వస్తే చాలు'

25 Jan, 2017 14:18 IST|Sakshi
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రత్యేక హోదా డిమాండ్ సాధించుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల కాదని ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదని,ఆ విషయం రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైందని ఆయన అన్నారు.
 
బుధవారమిక్కడ ఇందిరాభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు కావలసింది కమీషన్లని, అందుకోసమే ఆయన ప్రత్యేక హోదా అడగకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అడుగుతున్నారని శైలజానాధ్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా అన్నది రాష్ట్ర ప్రజల హక్కు. వారి ప్రాణం. నిరుద్యోగ సమస్య పరిష్కారనికి అదొక్కటే మార్గం. ఇవేవీ పట్టించుకోకుండా కేవలం కమీషన్ల కక్కుర్తి కోసం చంద్రబాబు రాజీ పడ్డారని ఘాటుగా విమర్శించారు. 
 
ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి నష్టం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వ వైఖరులకు వ్యతిరేకిస్తూ గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేబడుతున్నట్టు ఆయన చెప్పారు. అన్ని జిల్లాల కేంద్రాల్లోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన మౌన దీక్షలను చేపడుతున్నట్టు ప్రకటించారు.
మరిన్ని వార్తలు