పసివాళ్ల ప్రాణాలు.. జాగ్రత్త

13 Sep, 2014 22:55 IST|Sakshi

 నోయిడా: మీరు మీ చిన్నారులను ఆటోరిక్షాల్లో పంపిస్తున్నారా? ఆలోచించండి..ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులను  తీసుకెళ్తున్నారా? గమనిస్తున్నారా? లేదంటే చిన్నారులు ఆటో ప్రమాదాలకు బలయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రమాదాల నివార ణకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా పాఠశాలల యాజమాన్యాలతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులపై కూడా ఉంది. విద్యార్థులను ఇంటి వద్దకు చేర్చడానికి , ఇంటి నుంచి పాఠశాలకు రావడానికి మెరుగైన రవాణా సౌకార్యాలు ఆయా విద్యాసంస్థలు కల్పించాలి. ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వ్యవహరించాలి...
 
 తస్మాత్ జాగ్రత్త..!హెచ్చరించినా..
 అయితే పాఠశాల యాజమాన్యాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. పిల్లల పట్ల అజాగ్రత్తగా ఉండకూడదని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నాయి.‘ మీ పిల్లల్ని ఆటోరిక్షాల్లో పాఠశాలలకు పంపించవద్దు, చిన్నారులు పాఠశాలకు, అక్కడి నుంచి ఇంటికి భద్రంగా వచ్చేలా తల్లిదండ్రులు   బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచిస్తున్నాయి.. అయినా కొందరు తల్లిదండ్రులు ఆటో రిక్షాలనే ఆశ్రయిస్తున్నారు. పిల్లలు ప్రమాదాల బారిన పడడానికి కారకులవుతున్నారు.
 
 ఆటో బోల్తా చిన్నారి మృతి
 ఆటోల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు భద్రత కరువైంది. ఇటీవల నితారిలో పదేళ్ల విద్యార్థి ఆటో నుంచి ఎగిరి కిందపడ్డాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. పరిమితికి మించిన విద్యార్థులను ఆటోల్లో  తీసుకెళ్తుండగా మలుపు వద్ద ఆటో బొల్తాకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇదే ఆటోలో మొత్తం 11 మంది విద్యార్థులను పరిమితికి మించి పాఠశాలకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి సంఘటలు నోయిడా పరిధిలో జరగడం పరిపాటిగా మారింది. బస్సు స్టాప్‌లు దూరంగా ఉండడం వల్ల కొందరు చిన్నారుల తల్లిదండ్రులు ఆటోరిక్షాలను ఆశ్రయిస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనల తర్వాత తల్లిదండ్రులు, పాఠశాల యాజమానుల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
 
 భద్రతపై అప్రమత్తంగా ఉంటాం:
 విద్యార్థి తండ్రిసెక్టార్ -19కి చెందిన విద్యార్థి తండ్రి అరుణ్‌సింగ్ మాట్లాడుతూ ‘మాకు ఆటోరిక్షాలు అనుకూలంగా ఉన్నాయి. ఐదేళ్లుగా ఆటోల్లోనే పంపిస్తున్నాం. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఎప్పటికప్పుడు డ్రైవర్‌తో భద్రత చర్యలను చర్చిస్తామని, అనుభవం ఉన్న డ్రైవర్ అని చెప్పారు.
 
 అధిక ఫీజులతో భారం: విద్యార్థి తల్లి
 సెక్టార్ 57కు చెందిన మృథిలా దేవి మాట్లాడుతూ‘ ఇప్పటికే స్కూలు ఫీజులు, పుస్తకాలు తదితర ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి..భరించలేకపోతున్నాం. అందుకే ఆటో రిక్షాలను ఆశ్రయించాల్సి వస్తుంది. మా చిన్నారి రక్షణ విషయంలో ఏ మాత్రం రాజీపడేదిలేదు. కానీ, ఇటీవల ఆటో రిక్షా ప్రమాదంలో చిన్నారి మృతిచెందడంతో కళ్లు తెరిచాను. ఇప్పటికైనా ఆలోచిస్తా. నా ముగ్గురి పిలల్ని బడికి సుర క్షితంగా పంపించేలా చర్యలు తీసుకొంటాని అన్నారు.
 
 ఆటో  ఎప్పటికీ సురక్షితం కాదు
 సెక్టార్- 64కు చెందిన విద్యార్థి తండ్రి మాట్లాడుతూ‘ చిన్నారి మృతి చెందిన ఘటన తీవ్రంగాకలిచివేసింది.  నా కూతురును తీసుకెళ్లే ఆటో పరిమితికి మించిన విద్యార్థులను తరలిస్తుండగా గమనించా. నాతోపాటు మరికొందరు చిన్నారుల కోసం మరో ఆటోను ఆశ్రయించా.. ఇలా ఎన్ని ఆటోలను మార్చినా అధికలోడుతో వెళ్తున్నారు. ఇక ఆటోల్లో పిల్లల్ని తరలించడం సురక్షితం కాదని విరమించుకొన్నాని’అన్నారు.
 
 ఆటో రిక్షాల్లో పిల్లల్ని పంపించొద్దు: ప్రిన్సిపాల్
 సెక్టార్ -56లోని  సర్లా చోప్రా డీఏసీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్, పూనమ్ కల్రా మాట్లాడుతూ ‘మా పాఠశాల విద్యార్థులను చేరవేయడానికి 21 బస్సులను నడిపిస్తున్నాం. ఇందులో 3 బస్సులు పాఠశాలకు చెందినవే. మిగతా బస్సులు కాంట్రాక్ట్ పద్ధతిలో నడిపిస్తున్నాం, ఎక్కువ మంది విద్యార్థులు సమీప ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇందులో  ఎక్కువ మంది విద్యార్థుల్ని తమ తల్లిదండ్రులే స్వయంగా తమ వాహనాల్లో తీసుకొచ్చి పాఠశాల వద్ద దించి వెళ్తుంటారు. మరికొందరు కార్లలో కూడా తీసుకొచ్చి వదిలి వెళ్తుంటారు. ఎందుకంటే విద్యార్థులను ఆటోరిక్షాల్లో పంపించ వద్దని తల్లిదండ్రులకు సూచించాం. చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చర్యలు తీసుకొన్నామని’ అన్నారు.
 
 ఆటో రిక్షాలను ఆశ్రయించనీయం: రేణుసింగ్
 సెక్టార్-44లోని అమితీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ రేణుసింగ్ మాట్లాడుతూ బస్సు డ్రైవర్ల లెసైన్స్‌లు, ఐడీలను పరిశీలిస్తాం. అనుభవం ఉన్న వారినే డ్రైవర్లుగా నియమిస్తాం. పాఠశాల బస్సుల్లో పిల్లల్ని బస్సు స్టాప్‌లకు వరకూ సురక్షితంగా తరలిస్తాం. సాహిబాబాద్, ఘజియాబాద్ తదితర ప్రాంతాలకు చిన్నారులను క్యాబ్‌ల్లో పంపిస్తాం. ఆటో రిక్షాలను ఆశ్రయించవద్దని తల్లిదండ్రలకు సూచించాం. అసలు ఆటోల్లో విద్యార్థులను తీసుకొనిరావడం, తీసుకెళ్లడాన్ని కూడా పూర్తిగా నిషేధించామని అన్నారు.
 
 తల్లిదండ్రులకూ అవగాహన
 సెక్టర్ 28లోని విశాల భారతి పబ్లిక్ స్కూల్ రష్మి కక్రూ మాట్లాడుతూ వివిధ ప్రాంతాలకు సొంత బస్సుల్లోనే విద్యార్థులను ఇంటికి తరలిస్తాం. విద్యార్థులతో పాటే ఒక ఉపాధ్యాయుడు కూడా ఉంటారు. ఆటో రిక్షాల్లో విద్యార్థుల పంపించడ సురక్షితం కాదని తల్లిదండ్రలకు అవగాహన కల్పిస్తాం. అదేవిధంగా పలుజాగ్రత్తలు తీసుకోవాలని నోటీసులు కూడా జారీ చేస్తాం. డ్రైవర్,బస్సుకు సంబంధించిన అన్ని వివరాలు అధికారులకు పంపిస్తామని అన్నారు. అన్ని రకాల భద్రతా చర్యలను తీసుకొంటామని, ఇందులో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భాగస్వామలు అయ్యేలా చూస్తామని, అప్పుడే విద్యార్థుల ప్రయాణం సురక్షితంగా ఉంటుందని చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు