నోయిడాలో దారుణం.. సరకులు డెలివరీ చేసేందుకు వెళ్లి.. మహిళపై అత్యాచారం

29 Oct, 2023 16:22 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం జరిగింది. నిత్యావసర సరుకులు ఇవ్వడానికి వెళ్లిన డెలివరీ ఏజెంట్ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రేటర్ నోయిడాలోని ఎత్తైన అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మహిళ.. మొబైల్ యాప్‌లో కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేసింది. ఆర్డర్ డెలివరీ చేయడానికి మొబైల్ యాప్‌లో ఉద్యోగం చేస్తున్న నిందితుడు సుమిత్ సింగ్‌ వెళ్లాడు. గమ్యస్థానానికి చేరుకోగానే ఇంట్లో మహిళ ఒంటరిగా ఉన్నట్లు గుర్తించాడు సుమిత్. ఇంట్లోకి చొరబడి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై అక్కడి నుంచి పరారయ్యాడు.

శుక్రవారం ఈ ఘటన జరగగా.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుని కోసం వేట కొనసాగించారు. నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సుమిత్ తలదాచుకున్నట్లు సమాచారం అందుకుని చుట్టుముట్టారు. ఈ క్రమంలో నిందితుడు.. ఓ కానిస్టేబుల్ వద్ద పిస్టల్‌ను లాక్కుని పరారయ్యాడు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో గాయపడిన  సుమిత్‌ను అరెస్టు చేసి ఆస్పత్రిలో చేర్పించారు.    నిందితుడు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కేసులో శిక్షను అనుభవించాడు.  

ఇదీ చదవండి: కేరళలో భారీ పేలుడు.. ఉగ్రదాడి కలకలం!

మరిన్ని వార్తలు