ప్యాకేజీకి ఒప్పుకున్నాం.. దాన్ని కాదని వెళ్లలేం

31 Jan, 2017 02:30 IST|Sakshi
ప్యాకేజీకి ఒప్పుకున్నాం.. దాన్ని కాదని వెళ్లలేం
  • హోదా వల్ల ఉపయోగం లేదని ప్రచారం చేయండి
  • టీడీపీపీ సమావేశంలో ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం  
  • సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్రతరమవుతున్నా ప్రత్యేక ప్యాకేజీకే కట్టుబడి ఉండాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. కేంద్రం ప్రతిపాదించిన ప్యాకేజీకి ఒప్పుకున్నందున, దాన్ని కాదని వేరే దారిలోకి వెళ్లే పరిస్థితి లేదని అభిప్రాయపడింది. మ్యానేజ్‌ చేయడం మినహా మరో మార్గం లేదని తేల్చింది. ఈ విషయాలను పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఓ ఎంపీ తెలియజేశారు. ‘‘మా అధినేత చంద్రబాబు మమ్మల్ని ఢిల్లీలో మ్యానేజ్‌ చేయమంటున్నారు. మమ్మల్ని ఇంకేం మాట్లాడవద్దని స్పష్టంగా చెప్పారు. మేనేజ్‌ చేయడం మినహా ఇంకో దారి లేదు..’’ అని ఆ ఎంపీ తెలిపారు.

    పార్లమెంట్‌ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సోమవారం వెలగపూడి సచివాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ప్రత్యేక హోదా ఉద్యమ వేడిని పెంచిన నేపథ్యంలో సమావేశంలో ప్రధానంగా దీనిపైనే చర్చించారు. విశాఖతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కొవ్వొత్తుల ర్యాలీలకు అనుమతివ్వకపోవడం వల్ల ఎదురైన పరిణామాలను విశ్లేషించుకున్నారు. హోదా ఉద్యమం పెరగకుండా ఎప్పటికప్పుడు ప్యాకేజీ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని, వైఎస్సార్‌సీపీ ఎత్తుగడలను తిప్పికొట్టడంపై ప్రతి ఎంపీ దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు.

మరిన్ని వార్తలు