రోడ్డు వేస్తేనే మా గ్రామానికి రండి..

25 Apr, 2016 03:21 IST|Sakshi
రోడ్డు వేస్తేనే మా గ్రామానికి రండి..

అభ్యర్థులకు గ్రామస్తుల హెచ్చరిక

క్రిష్ణగిరి:  వందేళ్లుగా నివశిస్తున్నాం. మా గ్రామానికి రోడ్డు లేదు. కనీస వసతులు కూడా కల్పించలేదు. ప్రతిఎన్నికల్లోనూ అభ్యర్థులు వాగ్దానాలు చేసి ఓట్లు కొల్లగొడుతున్నారు. ఈ సారి ఓట్లు అడిగేందుకు వచ్చే అభ్యర్థులు మా గ్రామాలకు రోడ్డు వేసి లోనికి రావాలని, లేదంటే అడ్డుకుంటాం, నల్లజెండాలు ప్రదర్శిస్తామని  వేపనహళ్లి నియోజకవర్గంలోని చంబరసనపల్లి  పంచాయతీ పెద్దపాపనపల్లి గ్రామస్థులు, అంకొండపల్లి  పంచాయతీ చిన్నపాపనపల్లి, చక్కార్లు గ్రామస్థులు పేర్కొన్నారు. పెద్దపాపనపల్లిలో 30 ఇళ్లు, చక్కార్లులో 100, చిన్నపాపనపల్లిలో 60 ఇళ్లున్నాయి.  వందలాది ఏళ్లుగా ఇక్కడే నివశిస్తున్నామనీ.

తమ గ్రామాలకు రోడ్డు వసతి లేదు, పాఠశాలలు లేవు. తాగునీటి వసతులు లేవని గ్రామస్థులు తెలిపారు. ప్రతిసారి ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి వెళ్లుతున్నారేకాని, ఎన్నికల తర్వాత ముఖం చాటేస్తున్నారని గ్రామస్థులు వాపోయారు. ఈ గ్రామాలలో సరైన వైద్యసదుపాయాలు లేక అంగవికలురు ఎక్కువ. చిన్నపాపనపల్లిలో 20 మంది అంగవికలున్నారు. ఈ మాల పిల్లలు ఉన్నత చదువులకై సూళగిరికి ఎనిమిది కిలోమీటర్లదూరం నడచి వెళ్లుతున్నారు. ప్రాథమిక  పాఠశాలలకు వెళ్లాలంటే రెండు కిలోమీటర్ల దూరం నడచి వెళ్లవలసి వస్తుందని గ్రామస్థులు తెలిపారు. చిన్నారు నదికడ్డంగా వంతెన నిర్మాణం కోసం ఎన్నోసార్లు ప్రయత్నించినా ఫలితంలేదన్నారు.

ఈ గ్రామాల్లో చిరుత, ఏనుగుల భయం ఎక్కువ. అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఓటు గొడవ తప్పా తమ గోడు  పట్టించుకోవడంలేదని స్థానికులంటున్నారు. ఈ ఎన్నికలలో మాత్రం ఎవరినీ వదిలేదిలేదని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు