వలసవాసులదే హవా...!

23 Jan, 2015 23:31 IST|Sakshi
వలసవాసులదే హవా...!

విధానసభ ఎన్నికల చిత్రం
 
న్యూఢిల్లీ : విధానసభ తొలి ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఢిల్లీవాసుల నేపథ్యం మారిపోయింది. ఆనాటి ఎన్నికల్లో పంజాబీలు, వైశ్యులు, గ్రామీణులు  పార్టీల గెలుపుఓటములను నిర్ణయించేవారు. అయితే ప్రస్తుతం వలసవాసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఢిల్లీలో మొత్తం 70 నియోజకవర్గాలు ఉండగా 29 స్థానాల్లో అభ్యర్థుల గెలుపుఓటములను వలసవాసులు నిర్ణయించనున్నారు. 15నుంచి 16 సీట్లలో గ్రామీణులు, ఐదు నుంచి ఏడు సీట్లలో పంజాబీలు, నాలుగునుంచి ఐదు స్థానాల్లో వైశ్యులు అధికంగా ఉన్నారు.
 
ఢిల్లీవాసులు... ప్రపంచంలోని పలు మహానగరాలతో అనేక విషయాల్లో పోటీపడుతున్నప్పటికీ ఓటింగ్ విషయంలో మాత్రం ఇంకా కులం,మతం, ప్రాంతం పరిధులను దాటడానికి ఇష్టపడడం లేదని గత ఎన్నికలు నిరూపించాయి. అంశాల ఆధారంగా ఎన్నికలలో పోటీ చేస్తామంటూ పార్టీలు అంటునప్పటికీ ఆయా నియోజక వర్గాల్లో కులమతాల నేపధ్యాన్ని దృష్టిలో పెట్టుకునే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. నగర వాసుల్లో పది శాతం మంది బ్రాహ్మణులు ఉండడంతో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలు చెరో 11 మందికి, కాంగ్రెస్‌పార్టీ పది మందికి టికెట్లు ఇచ్చాయని అంటున్నారు. నగర జనాభాలో షెడ్యూలు కులాల ఓట్లు 17 శాతంగా ఉంది. దీనిని దృష్టిలో ఉం చుకుని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో 13 మందికి, ఆప్ 12 మందికి టి కెట్లు ఇచ్చాయి. ఇక రిజర్వ్‌డ్ నియోజవర్గాల సంఖ్య 12. ఒకప్పుడు షెడ్యూల్డ్ కులాలను కాంగ్రెస్ ఓటుబ్యాంకుగా పరిగణించేవారు. అయితే 2013 ఎన్నికలలో వారంతా ఆప్‌వైపు మొగ్గు చూపారు. ఈ వర్గం ఓటర్లను ఆకట్టుకోవడానికి మూడుపార్టీలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.

నగర  ఓటర్లలో 10 శాతమున్న  పంజాబీలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్, బీజేపీలు చెరో ఏడుగురికి, ఆప్ ఆరుగురికి టికెట్లు ఇచ్చాయి. ఇక ఎనిమిది శాతమున్న వైశ్య ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఆప్ పదిమంది వైశ్యులకు, బీజేపీ తొమ్మిదిమందికి, కాంగ్రెస్ పార్టీ ఆరుగురికి టికెట్లు ఇచ్చాయి.

 నగరంలో జాట్ ఓటర్ల సంఖ్య ఐదు శాతమే అయినప్పటికీ బీజేపీ 10 మందికి, కాంగ్రెస్, ఆప్‌లు తొమ్మిదేసి మందికి టికెట్లు ఇచ్చాయి. గుజ్జర్ ఓటర్ల సంఖ్య కూడా ఐదు శాతమే అయినప్పటికీ కాంగ్రెస్ తొమ్మిదిమందిని, బీజేపీ ఎనిమిది మందిని, ఆప్ ముగ్గురిని బరిలోకి దింపాయి. నగ ర ఓటర్లలో సిక్కులు మూడు శాతమే అయినప్పటికీ వారిని ఆకట్టుకోవడానికి మూడు ప్రధాన పార్టీలు తంటాలు పడుతున్నాయి. శిరోమణి అకాలీదళ్ కలసి ఎన్నికల్లో పోటీచేస్తున్న బీజేపీ ఏడుగురు సిక్కులను, ఆప్ నలుగురిని, కాంగ్రెస్ ముగ్గురిని నిలబెట్టాయి.
 
రెండు శాతమున్న యాదవులను ఆకట్టుకోవడానికి ఆప్, కాంగ్రెస్ ముగ్గురికి, బీజేపీ ఒకరికి టికెట్లు ఇచ్చాయి. రాజపుత్రుల సంఖ్య ఒక శాతమే అయినప్పటికీ ఆప్ ముగ్గురికి కాంగ్రెస్ ఇద్దరికి, బీజేపీ ఇద్దరికి టికెట్లు ఇచ్చాయి. 12 శాతమున్న ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవడానిక కాంగ్రెస్ ఆరుగురికి, ఆప్ ఐదుగురికి  బీజేపీ ఒక రికి టికెట్లు ఇచ్చాయి. ఉత్తరప్రదేశ్, బీహార్‌లకు చెందిన పూర్వాంచల్‌వాసుల సంఖ్య నగరంలో 16 శాతముంటుందని అంచనా. అయితే ఈసారి దాదాపు అన్ని పార్టీలు టికెట్ల విషయంలో వారికి మొండిచెయ్యి చూపాయి.  బీజేపీ ఒకరికి, ఆప్ కాంగ్రెస్‌లు చెరో ఇద్దరికీ టికెట్లు ఇచ్చాయి.

 

మరిన్ని వార్తలు