నిర్వేదం...

12 Mar, 2016 02:31 IST|Sakshi

భూ పరిహారం అందించలేదని రైతు ఆత్మహత్యాయత్నం
పోలీసుల ఎదుటే విషం తీసుకుని అఘాయిత్యం
కాలువ పనులను అడ్డుకున్న రైతులు
నేటికీ పూర్తిగా అందని సింగటాలూరు ఎత్తిపోతల పథకం భూముల పరిహారం

 
గదగ్ : తాలూకాలో సింగటాలూరు ఎత్తిపోతల పథకం కోసం భూములు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం వెంటనే తగిన భూ పరిహారం అందించాలని ఒత్తిడి చేస్తూ పోలీసుల ఎదుటే ఓ రైతు విషం తాగి ఆత్మహత్యయత్నం చేసిన ఘటన శుక్రవారం సంచలనం రేపింది.   తాలూకాలోని అడవి సోమాపుర గ్రామం వద్ద కాలువ నిర్మిస్తున్న స్థలంలో అధికారులు, పోలీసుల ఎదుటే రామణ్ణ హొసళ్లి అనే రైతు విషం తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. అతనిని గదగ్ రూరల్ పోలీసు స్టేషన్ ఎస్‌ఐ జూలకట్టి అడ్డుకొని విషం బాటిల్‌ను లాక్కొన్నాడు. గదగ్, కొప్పళ, బళ్లారి జిల్లాలో రైతుల పొలాలకు సాగునీరందించే సింగటాలూరు ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. కాలువ నిర్మాణ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

సింగటాలూరు ఎత్తిపోతల పథకం కోసం ప్రభుత్వం రైతుల పొలాలను స్వాధీనం చేసుకుంది. అయితే భూములు కోల్పోయిన వారి లో కొందరు రైతులకు మాత్రమే పరిహారం లభించింది. ఇంకా కొందరికి పరిహారం లభించలేదు. మరికొందరు పరిహా రం లభించినా తగినంత పరిహారం లభించలేదని ఆరోపిస్తూ పథకం పనులను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. పథకం పనులు పూర్తయినా భూములు కోల్పోయిన వారికి పరిహారం లభించక పోవ డంతో కోపోద్రిక్తులైన రైతులు అడవి సోమాపురం వద్ద జరుగుతున్న కాలువ పనులను శుక్రవారం అడ్డుకున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి అధికారులు, గదగ్ రూరల్ పోలీసులు చేరుకుని ఆందోళన చేస్తున్న రైతులతో చర్చిస్తుండగా, పనులు చేపట్టేందుకు ప్రయత్నించినా జేసీబీ డ్రైవర్‌పై రైతులు చేయి చేసుకోబోగా, పోలీసులు అడ్డుకొని శాంతియుతంగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
 

మరిన్ని వార్తలు