సీఎంపై శివకుమార్‌తల్లి ఆగ్రహం!

4 Aug, 2017 13:33 IST|Sakshi
సీఎంపై శివకుమార్‌తల్లి ఆగ్రహం!

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై  ఇంధనశాఖ మంత్రి డీకే శివకుమార్‌ కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివకుమార్‌తో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లపై దాడులకు సిద్ధరాయయ్యే కారణమని శివకుమార్‌ తల్లి గౌరమ్మ శుక్రవారమిక్కడ ఆరోపిస్తున్నారు. తన కుమారుడి రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారని గౌరమ్మ వ్యాఖ్యానించారు. ఇతర పార్టీవాళ్లతో పాటు సొంత పార్టీ అయిన కాంగ్రెస్‌లోనే తన కొడుకుకు అనేకమంది శత్రువులు ఉన్నారన్నారు. ఐటీ దాడుల వెనుక సీఎం హస్తముందని ఆమె ఆరోపించారు.

‘నా కొడుకుపై అందరూ అసూయపడ్డారు, అతనిని హాని చేయాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఓవైపు నా కొడుకును ఉపయోగించుకుంటూనే మరోవైపు పదే పదే అతనిని మోసం చేసాడు. నా కొడుకులు ఇద్దరు పార్టీ కోసం ఎంతో పని చేస్తున్నారు. తన కుమారుడి అండతోనే సీఎం రాజకీయంగా మనగలుగుతున్నారు. నా కొడుకులు దేశం కోసం పని చేస్తున్నారు. ఇతరుల నుంచి దొంగతనమేమీ చేయలేదు. ఐటీ దాడుల వ్యవహారంపై సీఎం ఎందుకు స్పందించడం లేదు’ అని ప్రశ్నించారు. కాగా రాజకీయ కక్షతోనే ప్రధాని మోదీ ఈ దాడులు చేయించారని గౌరమ్మ అన్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం మంత్రి శివకుమార్‌ నివాసంపై ఐటీ దాడులు కేంద్ర బీజేపీ సర్కారు రాజకీయ కక్ష సాధింపేనని వ్యాఖ్యానించారు. కాగా మంత్రి శివకుమార్‌ తల్లి ఆరోపణలపై కాంగ్రెస్‌ నేతలు స్పందిస్తూ...ఆమె ఎందుకు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో తమకు తెలియదని, దీనిపై మంత్రి శివకుమారే స్పందించాల్సి ఉందన్నారు.

ఐటీ దాడులతో హస్తం ప్రతీకారం!
కాగా శివకుమార్‌ నివాసంపై  ఐటీ దాడులతో కంగుతిన్న రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం షాక్‌ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. అధినేత్రి సోనియాగాంధీకి, రాహుల్‌గాంధీకి ఎంతో దగ్గరివాడైన డీకే శివకుమార్‌పై ఐటీ దాడులు ఆ పార్టీని కదిలించాయి. కసి తీర్చుకోవడానికి వారి ఆదేశాలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పథకం రచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

శాసనసభ ఎన్నికలు మరో పదినెలల్లో రానున్న నేపథ్యంలో ఈ దాడుల ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న విషయంపై పార్టీ ముఖ్య నేతలతో సిద్ధరామయ్య ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. విపక్షాలకు ఈ ఐటీ దాడి ఓ ప్రధాన అస్త్రం కానుందని మెజారిటీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఐటీ దాడులు, వాటి మీద జనాభిప్రాయంపై ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా సిద్ధు సమాచారం సేకరిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ హై కమాండ్‌కు తెలియజేస్తున్నారు.

కేసులపై కాంగ్రెస్‌ పెద్దలకు నివేదిక!
ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి నిన్న రాష్ట్ర ఏసీబీ, లోకాయుక్త అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ, జేడీఎస్‌ నేతలపై ఈ రెండు దర్యాప్తు సంస్థల వద్ద పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్పతో పాటు ఎంపీ శోభకరంద్లాజే, కేంద్రమంత్రి అనంతకుమార్, ఎంపీలు పీ.సీ మోహన్, శ్రీరాములు, సీనియర్‌ నేతలు ఆర్‌.అశోక్, కట్టాసుబ్రహ్మణ్యం తదితర 17 మంది నాయకులపైనున్న కేసుల వివరాలను తెప్పించుకున్నారు. ఇక జేడీఎస్‌కు సంబంధించి కుమారస్వామి గురించి కూడా సమాచారం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వారిపై ఏయే కేసులు, ఎక్కడెక్కడ నమోదైందీ అధికారులు సీఎంకు వివరించారు. ఈ వివరాలన్నింటినీ సిద్ధరామయ్య పార్టీ ఢిల్లీ పెద్దలకు ఒకటి రెండు రోజుల్లో నివేదిక పంపించనున్నారు. ఏసీబీ, లోకాయుక్తకు బీజేపీ నాయకులను టార్గెట్‌ చేసుకుని కేసుల దర్యాప్తును ప్రారంభించాలని సిద్ధరామయ్య సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

>
మరిన్ని వార్తలు