Telangana CM Selection: తెలంగాణ సీఎం ఎంపిక.. ఇది కాంగ్రెస్సేనా?

5 Dec, 2023 21:34 IST|Sakshi

కాంగ్రెస్‌ అధిష్టానం ఏనాడైనా త్వరగతిన ఓ నిర్ణయం తీసుకుంటుందా?.. చర్చోపచర్చలు,  అసంతృప్త నేతల బుజ్జగింపులు..  స్టేట్‌ టు హస్తిన రాజకీయాలు.. క్యాంప్‌ రాజకీయాలు.. హైకమాండ్‌ తీవ్ర తర్జన భర్జనలు.. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇలాంటి పరిస్థితులే కనిపించేవి. ఈ పరిస్థితుల్నే ఆధారంగా చేసుకుని ప్రత్యర్థులు హస్తం పార్టీపై జోకులు కూడా పేల్చేవాళ్లు.  కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది ఇంత వేగంగా ప్రకటిస్తుందని, అసంతృప్తుల పంచాయితీని కూడా ఇంత తక్కువ టైంలో తేలుస్తుందని రాజకీయ వర్గాలు ఊహించి ఉండవు!.  


ఏ పార్టీలో అయినా వర్గపోరు.. నేతల విభేదాలు సహజం. అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీలో అవి పరిధి దాటిపోతూ కనిపిస్తూ వస్తున్నాయి. సపోజ్‌..  తెలంగాణ కాంగ్రెస్‌నే పరిశీలిద్దాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్సెస్ ఆయన వ్యతిరేకవర్గం(కొందరు సీనియర్లు) మధ్య విభేదాలతో తెలంగాణ కాంగ్రెస్ నిలువునా చీలిపోతుందేమో అనే పరిస్థితి నెలకొంది. ఒక్క తెలంగాణ మాత్రమే కాదు, రాజస్థాన్‌లో సీనియర్‌ వర్గం జూనియర్‌వర్గం, కర్ణాటకలోనూ కీలక నేతల మధ్య వర్గపోరుతో దాదాపు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. మరీ ముఖ్యంగా సీనియర్లు వర్సెస్‌ జూనియర్ల పంచాయితీలను తీర్చేందుకు కొన్ని సందర్బాల్లో ఏఐసీసీ పెద్దలే రంగంలోకి దిగాల్సి వచ్చింది. అలాంటిది రేవంత్‌రెడ్డిని సీఎంగా కేవలం రెండే రోజుల్లో ప్రకటించడం ఇప్పుడు కచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేసేదే!. 

సెటైర్లు.. జోకులు.. 
‘‘ఇక్కడ సీఎం పోస్ట్‌ కోసం కాంగ్రెస్‌లో కనీసం 8 మంది రెడీగా ఉన్నారేమో!’’ అంటూ.. కిందటి ఏడాది హిమాచల్‌ ప్రదేశ్‌  అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేత అమిత్‌ షా కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. అలాగే.. నిన్న జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనూ బీఆర్‌ఎస్‌ ఇదే తరహా కామెంట్లతో కాంగ్రెస్‌పై జోకులు పేల్చింది. అంతెందుకు కర్ణాటక ఎన్నికల సమయంలోనూ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలోనూ ఫలితాలు వచ్చాక ఐదు రోజుల సమయం తీసుకోవడంపై హస్తం పార్టీని ప్రత్యర్థులు ఎద్దేవా చేశారు. సీఎం పంచాయితీ తప్పదేమోనని భావించిన తరుణంలో త్వరగతిన, అదీ పక్కా నిర్ణయం తీసుకుని రాజకీయ వర్గాలకు పెద్ద షాకే ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ.  కాం‍గ్రెస్‌ మాత్రం తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్న అనుభవంతోనే ముందుకు సాగింది. 

ఆ తర్వాతే సీన్‌ మారింది.. 
వరుసగా పలు రాష్ట్రాల్లో ఓటములు.. అధికారం కోల్పోవడం గ్రాండ్‌ ఓల్డ్‌పార్టీని దెబ్బేస్తూ వచ్చాయి. ఈ మధ్యలో రాహుల్‌ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడ్ని చేశాక.. సీనియర్ల(జీ23 గ్రూప్‌) స్వరం పెద్ద తలనొప్పిగా మారింది. ఆఖరికి పార్టీ ప్రక్షాళన పేరిట కాంగ్రెస్‌ చింతన్‌ శిబిర్‌ (కాంగ్రెస్‌ నవ సంకల్ప్‌ శిబిర్‌) నిర్వహించినా.. అది కూడా అట్టర్‌ప్లాపే అయ్యింది. ఇలాంటి దశలో కాంగ్రెస్‌ అంతర్గత సంక్షోభం నుంచి బయటపడుతుందా? అనే అనుమానాలు తలెత్తాయి. అయితే రాహుల్‌ గాంధీ జోడో యాత్ర తర్వాత సీన్‌ మారింది. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూనే.. నేతల మధ్య ఐక్యత కోసం ఏఐసీసీ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. కలిసి ఉంటేనే దక్కును అధికారం అని నేతలకు హితబోధ చేస్తూ వచ్చింది. ఇందుకోసం రాష్ట్ర వ్యవహారాలను  పర్యవేక్షణకు అనుభవజ్ఞులైన నేతల్ని నియమిస్తూ వచ్చింది. 

ఈ క్రమంలోనే రాజస్థాన్‌ సంక్షోభానికి ఎన్నికల వేళ చెక్‌ పెట్టడం, రెండు రోజుల వ్యవధిలోనే హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం, అలాగే.. డీకే శివకుమార్‌లాంటి సమర్థవంతమైన నేతను బుజ్జగించి కర్ణాటకలో సిద్ధరామయ్యను సీఎం చేయడం, ఇప్పుడు తెలంగాణలో అసమ్మతులతో సంప్రదింపులు జరిపి రేవంత్‌రెడ్డిని సీఎం చేయడం చేసింది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్‌ పెద్ద దెబ్బే. కానీ, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీని ఓడించి అధికారం కైవసం చేసుకోవడం మాత్రం మామూలు విషయం కాదు. ఇందుకు.. పార్టీలో ఐక్యత కూడా ఒక కారణమనేది కచ్చితంగా చెప్పొచ్చు. ఇదే టీమ్‌ ఎఫర్ట్‌ స్ట్రాటజీతో గనుక ముందుకు సాగితే.. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ మెరుగైన ఫలితాలు సాధించడంంలో సఫలం కావొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. 

ఇదీ చదవండి: రేవంత్‌రెడ్డి.. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే!

>
మరిన్ని వార్తలు