డీఎంకే నా ఊపిరి

13 Dec, 2014 03:16 IST|Sakshi
డీఎంకే నా ఊపిరి

* కరుణ నా నేత
* దళపతి మార్గదర్శి
* వైదొలిగే ప్రసక్తే లేదు
* దురైమురుగన్ స్పష్టీకరణ

సాక్షి, చెన్నై:‘డీఎంకే నా ఊపిరి, పార్టీ సిద్ధాంతాలు ముఖ్యం. కరుణానిధి నా నాయకుడు, దళపతి స్టాలిన్ మా మార్గదర్శి.. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను డీఎంకే నుంచి వైదొలిగే ప్రసక్తే లేదు’ అని ఆ పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ స్పష్టం చేశారు. తాను డీఎంకే నుంచి వైదొలిగినట్టుగా బయలుదేరిన ప్రచారానికి ముగింపు ఇస్తూ శుక్రవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డీఎంకేలో సంస్థాగత ఎన్నికలు సాగుతున్న విషయం తెలిసిందే. పార్టీ పరంగా జిల్లాల విభజన పర్వం జరిగింది.

జిల్లాల సంఖ్య పెరగడంతో తమకు పట్టున్న ప్రాంతాల్లో కార్యాదర్శుల పదవుల్ని చేజిక్కించుకునేందుకు సీనియర్లు, మాజీ కార్యదర్శులు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. అధినేత కరుణానిధి ప్రసన్నంతో కొందరు, దళపతి స్టాలిన్ ఆశీస్సులతో మరికొందరు పదవుల్ని తన్నుకెళ్లడం కోసం నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు సీనియర్లు, మాజీల యితే, తమ వార సుల్ని రేసులో దించేందుకు రెడీఅయ్యారు. ఆ దిశగా డీఎంకే సంయుక్త ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ తన వారసుడ్ని రంగంలోకి దించే ప్రయత్నాలు వేగవంతం చేశారు.

వేలూరు జిల్లా  కార్యదర్శి పదవి తనయుడు కదిర్ ఆనంద్‌కు ఇప్పించే విధంగా కసరత్తుల్లో మునిగినట్టు, ఇందుకు కరుణానిధి, స్టాలిన్ నిరాకరించినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఆగ్రహించిన దురైమురుగన్ ఇక డీఎంకేలో ఇమడలేమన్న నిర్ణయానికి వచ్చినట్టు, అధినేత కరుణానిధిని కలిసి గురువారం రాత్రి తన పదవికి రాజీనామా చేసినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి.

వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్లలో దురైమురుగన్ రాజీనామా చర్చ బయలుదేరడంతో మీడియా దృష్టి డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయం మీద పడింది. డీఎంకేలో అతిముఖ్య నేతగా ఉన్న దురైమురుగన్ ఇక తప్పుకున్నట్టేనన్న నిర్ధారణకు వచ్చారు. ఆయన రాజీనామాను కరుణానిధి ఆమోదించనట్టు, బుజ్జగించే పనుల్లో ఉన్నట్టుగా సంకేతాలు రావడంతో  మీడియాల్లో డీఎంకేకు ‘దురై’ గుడ్ బై చెప్పినట్టుగా కథనాలు వెలువడ్డాయి.
 
అవన్నీ తప్పులే
మీడియాల్లో కథనాలు రావడంతో డీఎంకేలో చర్చ బయలుదేరింది. తాను రాజీనామా చేసినట్టుగా వస్తున్న కథనాల్ని పరిగణనలోకి తీసుకున్న దురైమురుగన్ ఆ ప్రచారానికి ముగింపు పలకడం లక్ష్యంగా శుక్రవారం ఉదయం మీడియా ముందుకువచ్చారు. అవన్నీ తప్పు డు ప్రచారాలేనని ఖండించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ, డీఎంకేను వీడనని, వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు