సస్పెన్షన్‌ రద్దు!

24 Jun, 2017 04:25 IST|Sakshi
సస్పెన్షన్‌ రద్దు!

ఏడుగురు డీఎంకే ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ ఎత్తివేత
ధన్యవాదాలు తెలిపిన స్టాలిన్‌
అధికార, ప్రతిపక్షాలు చెట్టాపట్టాల్‌
వాకౌట్‌ లేకుండానే ముగిసిన సమావేశం

సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రతిపక్షం ఆగ్రహం, అధికార పక్షం నిగ్రహం లేదా వాగ్యుద్ధాలు వాకౌట్‌లో సాగుతున్న అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నాడు మాత్రం ప్రశాంతంగా ముగిశాయి. డీఎంకే ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ రద్దు, ప్ర«ధాన ప్రతిపక్ష నేత స్టాలిన్‌ ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం, వివిధ అంశాలపై చర్చలతో శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగి ముచ్చట గొలిపాయి. శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత స్పీకర్‌ ధనపాల్‌ మాట్లాడుతూ అసెంబ్లీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు తన ప్రకటనను వెలిబుచ్చుతారని అన్నారు.

ఆ తరువాత సంఘం అధ్యక్షుడు, ఉప సభాపతి పొల్లాచ్చి జయరామన్‌ మాట్లాడుతూ, డీఎంకే సభ్యులు ఎస్‌ అంబేద్కుమార్‌ (వందవాశి), కేఎస్‌. మస్తాన్‌(సెంజి),కేఎస్‌.రవిచంద్రన్‌(ఎగ్మూరు), సురేష్‌ రాజన్‌ (నాగర్‌కోవిల్‌), కె.కార్తికేయన్‌ (రిషివందయం), పి. మురగన్‌ (వేప్పనగల్లి) కేకే. సెల్వం (ఆయిరమ్‌ విళక్కు)ల క్రమశిక్షణ ఉల్లంఘన నివేదికను కమిటి తరఫున అసెంబ్లీకి సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నివేదికను ఈ రోజే చర్చకు పెట్టాలని అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత, మంత్రి సెంగోట్టయ్యన్‌ తీర్మానాన్ని ప్రతిపాదించగానే అసెంబ్లీ అభీష్టానికి వదిలేయగా ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఈ సమయంలో స్పీకర్‌ ధనపాల్‌ మాట్లాడుతూ ఈ  ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన సదరు ఏడుగురు డీఎంకే ఎమ్మెల్యేలు సభా హక్కులను ఉల్లంఘించారని, అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగకుండా అడ్డుకున్నారని తెలిపారు. వీరిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యే వెట్రివేల్‌ తనకు సమర్పించిన ఉత్తరం ఆధారంగా ఆరునెలలపాటు సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. సస్పెండ్‌ కారణంగా ఈ ఆరునెలల కాలంలో ఎమ్మెల్యేల వేతనం, ఇతర ఆదాయాలు పొందలేరని క్రమశిక్షణ సంఘం ఆరోజు ప్రకటించిందని అన్నారు.

అయితే సదరు ఏడుగురు ఎమ్మెల్యేలు తనవద్దకు వచ్చి పశ్చాత్తాపపడ్డారని, ఇకపై అలా నడుచుకోమని విన్నవించుకున్నారని స్పీకర్‌ తెలిపారు. వారిని శిక్షించాలని అసెంబ్లీ కోరినా మన్నించి సస్పెన్షన్‌ ఉత్తర్వులను రద్దు చేస్తున్నానని ప్రకటించారు. ఆసియా ఖండంలోనే తమిళనాడు ఆరోగ్యకరమైన రాష్ట్రంగా విరజిల్లాలని ఆశిస్తున్నట్లు స్పీకర్‌ పేర్కొనారు. ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్‌ స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు ఎయిమ్స్‌ వైద్యశాల ఏ జిల్లాలో స్థాపిస్తారని స్టాలిన్‌ అడిగిన ప్రశ్నకు వైద్యశాఖా మంత్రి విజయభాస్కర్‌ బదులిస్తూ, అన్ని జిల్లా ఎమ్మెల్యేలు తమ ప్రాంతంలో నెలకొల్పాలని కోరుతున్నారు, అయితే ఈ విషయమై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున గతనెల 24వ తేదీన ఉత్తరం రాశామని చెప్పారు. ఏదేమైనా రాష్ట్రానికి ఎయిమ్స్‌ వైద్యశాలను సాధించి తీరుతామని హామీ ఇచ్చారు.

స్టాలిన్‌తో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల భేటీ:
 రాజీవ్‌గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న పేరరివాళన్‌ను పెరోల్‌పై విడుదల చేసే అంశంలో మద్దతు కోరుతూ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ప్రజాప్రతినిధులను కలిసేందుకు పేరరివాళన్‌ తల్లి అర్బుతామ్మాళ్‌ శుకవారం సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పెరోల్‌పై కలిసి చర్చించుకోవడం మరో విశేషం.
 

మరిన్ని వార్తలు