కల్లోలాలు మంచివి కావు

14 Oct, 2023 05:52 IST|Sakshi

ఉగ్రవాదమూ అంతే: మోదీ

ఎవరికీ మేలు చేయవని వ్యాఖ్య

జీ 20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సులో ప్రసంగం

న్యూఢిల్లీ: ఘర్షణలు, కల్లోలాలు ఏ పక్షానికీ మంచి చేయబోవని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలకు విచి్ఛన్న ప్రపంచం పరిష్కారాలు చూపజాలదన్నారు. ఇది శాంతి, సౌభ్రాతృత్వాలు నెలకొనాల్సిన సమయమని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య పోరు నానాటికీ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

శుక్రవారం ఇక్కడ మొదలైన జీ20 పార్లమెంటరీ స్పీకర్ల 9వ సదస్సు ప్రారంభ సెషన్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ప్రపంచంలో పలు చోట్ల ప్రస్తుతం ఏం జరుగుతోందో మనందరికీ తెలుసు. కలసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయమిది’’ అని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, హమాస్‌ పోరుకు తక్షణం తెరపడాల్సిన అవసరం చాలా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పరస్పర విశ్వాసంతో మానవ విలువలకు పెద్ద పీట వేయడమే ఇందుకు మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉగ్రవాదంపై ఉక్కుపాదమే మార్గం
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాద భూతంపై అంతర్జాతీయ సమాజం ఉక్కుపాదం మోపడమే ఏకైక మార్గమని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘భారత్‌ దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. మా దేశంలో వేలాదిగా అమాయకులను బలి తీసుకుంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే మానవత్వానికి మాయని మచ్చ‘ అని పునరుద్ఘాటించారు. ఇంత జరిగినా ఉగ్రవాదాన్ని నిర్వచించే అంశం మీద కూడా ఇప్పటికీ అంతర్జాతీయ సమాజం ఏకాభిప్రాయానికి రాలేకపోవడం శోచనీయమన్నారు.

మహిళా భాగస్వామ్యానికి ప్రోత్సాహం
భారత్‌లో ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పిస్తున్నట్టు మోదీ తెలిపారు. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో సగం మేరకు వాళ్లే ఉన్నట్టు పార్లమెంటుల స్పీకర్లకు వివరించారు. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ ఇటీవలే పార్లమెంటులో చట్టం కూడా చేసినట్టు చెప్పారు. ‘నేడు భారత్‌ ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యంతో కళకళలాడుతోంది.

ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో మహిళల చురుకైన పాత్ర దేశ ప్రగతికి చాలా కీలకం‘ అని అన్నారు. భారత్‌లో 28 భాషల్లో ఏకంగా 900కు పైగా టీవీ చానళ్లు, దాదాపు 200 భాషల్లో 33 వేలకు పైగా వార్తా పత్రికలు ఉన్నాయని వారికి వివరించారు. ప్రపంచమంతటా దేశాల నాయకత్వ స్థానంలో మహిళలు ఎక్కువగా ఉంటే బహుశా ఇన్ని యుద్ధాలు జరిగేవి కాదని ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌ ప్రెసిడెంట్‌ దుతర్తే పచెకో అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు