జాలర్లపై దాడి

7 Mar, 2017 03:45 IST|Sakshi
జాలర్లపై దాడి

ఇన్నాళ్లు బంగాళాఖాతంలో శ్రీలంక సేనలు తమిళ జాలర్ల మీద విరుచుకు పడుతుంటే, తాజాగా అరేబియా సముద్రంలో వేటకు వెళ్లిన కన్యాకుమారి జాలర్లను ఇంగ్లాండ్‌ సేనలు బందీగా పట్టుకు వెళ్లాయి.

సాక్షి, చెన్నై: తమిళ జాలర్ల మీద శ్రీలంక సేనలు సృష్టిస్తున్న వీరంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం దాడులు, బందీలుగా పట్టుకెళ్లడం సర్వసాధారణం. ఇప్పటి వరకు వందకు పైగా పడవలు, పదుల సంఖ్యలో జాలర్లు ఆ దేశ చెరలో ఉన్నారు. వీరిని విడిపించేందుకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం, జాలర్ల సంఘాలు తీవ్రంగానే ఒత్తిడి తెస్తున్నా ఫలితం శూన్యం. ఇన్నాళ్లు శ్రీలంక సేనల నుంచి తమకు ప్రమాదం పొంచి ఉందనుకుంటే, తాజాగా ఇంగ్లాండ్‌(బ్రిటీష్‌)దేశ సేనలు సైతం ప్రతాపం చూపించడం జాలర్లలో ఆందో ళనకు దారి తీస్తోంది.

బంగాళా ఖాతంలో భద్రత కరువుతో కన్యాకుమారి జాలర్లు అరేబియా సముద్రం వైపుగా వేట సాగిస్తూ వస్తున్నారు. కేరళ సరిహద్దుల్లోని తమిళ గ్రామాల్లోని జాలర్లు కొచ్చి మీదుగా తమ చేపల వేట సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోకన్యాకుమారి జిల్లా నిత్ర విలై సమీపంలోని ఇరువి బుద్ధన్  గ్రామానికి చెందిద్ధాల్బర్ట్‌ పడవలో డేని, ప్రడీ, సోని, జోషప్, ఆంటోని, షాజీలు, కొచ్చికి చెందిన మరొకరి బోటులో కుమరికి చెందిన మరి కొందరు ఆదివారం వేటకు వెళ్లారు. అరేబియా సముద్రంలో ఓ దీవులకు సమీపంలో వేటలో ఉన్న వీరిని బ్రిటీషు నావికాదళం చుట్టుముట్టింది. నాలుగైదు పడవల్ని, 32 మందిని బందీలుగా పట్టుకెళ్లింది.

ఈ సమాచారం కొచ్చిలోని మత్స్య శాఖ వర్గాల ద్వారా కన్యాకుమారికి సమాచారం చేరింది. కన్యాకుమారికి చెందిన జాలర్లు పదిహేను మందికి పైగా  ఇంగ్లాండ్‌ సేనల వద్ద బందీలుగా ఉన్న సమాచారంతో ఆందోళన బయల్దేరింది. తమ వాళ్లను విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీలంకతో పాటుగా ఇతర దేశాల చెరలో ఉన్న తమిళ జాలర్లను విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్ష నేత, డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్  డిమాండ్‌ చేశారు. పదవిని కాపాడుకునే ప్రయత్నంలో జాలర్లను విస్మరించ వద్దు అని సీఎంకు హితవు పలికారు.

మరిన్ని వార్తలు