త్రిషను క్షమాపణ కోరిన మన్సూర్‌.. రక్తపాతం లేని యుద్ధంలో గెలిచానంటూ..

24 Nov, 2023 11:45 IST|Sakshi

కోలీవుడ్‌లో హీరోయిన్‌ త్రిష గురించి సినీ నటుడు మన్సూర్ అలీఖాన్ మాట్లాడడం వివాదాస్పదమైంది. దీనిపై త్రిష, చిరంజీవి, లోకేష్ కనగరాజ్, మాళవిక మోహనన్ తదితరులు తీవ్రంగా విమర్శించారు. ఇలా చాలామంది నటీనటులు మన్సూర్‌ అలీఖాన్‌ను తప్పుబట్టారు. అయితే తాను తప్పుగా మాట్లాడలేదని మన్సూర్ అన్నారు. మరోవైపు మన్సూర్ అలీఖాన్‌పై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ తమిళనాడు డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఆయనకు నోటీసులు కూడా జారీ అయ్యాయి.

దీని ఆధారంగా నిన్న(నవంబర్23) ఉదయం 11 గంటలకు స్వయంగా హాజరు కావాలని మన్సూర్ అలీఖాన్‌కు సమన్లు ​​పంపారు. అయితే ముందస్తు బెయిల్ కోసం మన్సూర్ అలీఖాన్ చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు నవంబర్‌ 24న విచారణకు వస్తానని ఆయన చెప్పాడు. కానీ తాజాగా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే త్రిషకు మన్సూర్ అలీఖాన్ క్షమాపణలు చెప్పాడు.

కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఈ కేసులో ఫైనల్‌గా త్రిషకు మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణలు చెప్పడంతో ఈ గొడవ ఇంతటితో క్లోజ్‌ కానుంది. అతను ప్రచురించిన ప్రకటనలో ఇలా పేర్కొన్నాడు. 'నేను కత్తి లేకుండా ఒక వారం పాటు యుద్దం చేశాను. ఈ వార్‌లో రక్తపాతం లేకుండానే నేను గెలిచాను! నాకు అండగా నిలిచిన నాయకులు, నటీనటులు, పాత్రికేయులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను తప్పుపట్టిన వ్యక్తులకు వినయపూర్వకమైన నమస్కారములు. నా వ్యాఖ్యలతో త్రిష మనసుకు బాధ కలిగించాయి. అందుకు క్షమాపణ చెబుతున్నా.

ఇంతటితో ఈ కళింగ యుద్ధం ముగిసింది. అప్పుడు లక్షలాది మంది చనిపోవడంతో, సామ్రాట్ అశోకుడి గుండె నుంచి రక్తం ఏరులైపారింది. దీంతో ఆయన అహింసను స్వీకరించాడు. ఇక్కడ నేను కూడా అహింస మార్గం వైపే నిలబడ్డాను.' అని మన్సూర్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు