నిబంధనలకు భిన్నంగా పార్కింగ్ లాట్ల కేటాయింపు

1 Aug, 2013 03:36 IST|Sakshi

ముంబై: ఠాణే, ముంబై, నవీముంబైలలోని ఫ్లైఓవర్ల కింద నిబంధనలకు భిన్నంగా పార్కింగ్ లాట్లను కేటాయించిన  అధికారులపై ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. నిబంధనలకు భిన్నంగా కేటాయింపులు జరపడంపై సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ జరిపిస్తామని విధానసభలో బుధవారం ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇటువంటి 12 పార్కింగ్ లాట్ల కేటాయింపు జరిగిందని, అయితే భద్రతను దృష్టిలో పెట్టుకుని అటువంటిచోట్ల పార్కింగ్ లాట్లు ఏర్పాటు చేయకూడదనేది ప్రభుత్వ విధానమని మంత్రి జయ్‌దత్ క్షీర్‌సాగర్ సభకు తెలియజేశారు. ఎమ్మెన్నెస్ సభ్యుడు నితిన్ సర్దేశాయ్ తదితరులు అడిగినప్రశ్నకు ఆయన పైవిధంగా జవాబిచ్చారు. అయితే సంబంధిత శాఖ ఈ విషయంలో నిర్లిప్త ధోరణిని అవలంబించడంపట్ల స్పీకర్ దిలీప్‌వాల్సే పాటిల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనలను తోసిరాజని పార్కింగ్ లాట్లను ఏవిధంగా కేటాయిస్తారంటూ సంబంధిత అధికారులపై మండిపడ్డారు. అసలు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నిర్ణయాలకు ఎందుకు కట్టుబడి ఉండడం లేదంటూ నిలదీశారు. అనంతరం ప్రతిపక్ష నాయకుడు ఏక్‌నాథ్‌ఖడ్సే మాట్లాడుతూ భద్రతను దృష్టిలో పెట్టుకునే ఫ్లైఓవర్ల కింద పార్కింగ్ లాట్లను కేటాయించకూడదని ప్రభుత్వం 2008లోనే నిర్ణయించిందన్నారు.
 
 అయితే అందుకు భిన్నంగా ఆరుగురు కాంట్రాక్టర్లకు సంబంధిత అధికారులు పార్కింగ్ లాట్లను కేటాయించారన్నారు. ఈ కేటాయింపుల వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల రాబడి రావాలని, అయితే వచ్చింది మాత్రం రూ. 248 కోట్లేనని తెలిపారు. ఈ కే టాయింపుల్లో భారీ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయన్నారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్వయంగా ఈ కాంట్రాక్టులకు ఆమోదముద్ర వేశారన్నారు. అనంతరం మంత్రి జయ్‌దత్ క్షీర్‌సాగర్ మాట్లాడుతూ ఐఏఎస్ అధికారి ఆర్.ఎ.రాజీవ్ నేతృత్వంలో కమిటీని నియమిస్తున్నట్టు ప్రకటించారు.  సదరు కమిటీ విచారణ జరిపి రెండు నెలల్లోగా ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పిస్తుందన్నారు. అయితే కమిటీ నియామకాన్ని పీజంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ (పీడబ్ల్యూపీ) ఎమ్మెల్యే గణపత్‌రావ్ దేశ్‌ముఖ్ వ్యతిరేకించారు.  కమిటీ  అవసరమే లేదని, తప్పు చేసిన అధికారులపై చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు.
 
 సొంత ఇళ్లు ఉన్నా ప్రభుత్వ క్వార్టర్లలోనే
 19 మంది ఐపీఎస్ అధికారులకు సొంత ఇళ్లు ఉన్నప్పటికీ వారంతా ప్రభుత్వ క్వార్టర్లలోనే ఉంటున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ విధానసభకు తెలియజేశారు. నగరంతోపాటు ఠాణే, నవీముంబై తదితర ప్రాంతాల్లో వారికి సొంత ఇళ్లు ఉన్నాయన్నారు. అయితే ఎవరైనా అధికారి ఒకటి కి మించి క్వార్టర్లు పొందారా అనే అంశంపై విచారణ జరుపుతామన్నారు.

మరిన్ని వార్తలు