‘జలయుక్త' లో అంతా బోగస్సే

7 Jun, 2015 00:22 IST|Sakshi

షోలాపూర్ జల నిపుణుడు ప్రఫుల్లా పటేల్
షోలాపూర్:
షోలాపూర్ జిల్లాలోని చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం (జలయుక్త శివారు) పర్యవేక్షించడానికి వచ్చిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలెక్టర్ సహా ఉన్నతాధికారులంతా మోసగించారని సాంగోళాకు చెందిన జల నిపుణుడు ప్రఫుల్లా పటేల్ ఆరోపించారు. శనివారం విలేకరు సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని ఈ విషయంలో పక్కదారి పట్టించారని, దీనికి సంబంధించిన నివేదికను సీఎంవోకు పంపానని చెప్పారు. ‘జిల్లాలో జలశివారు ప్రోగ్రాం ద్వారా చేపట్టిన పనులను సందర్శించేందుకు సీఎం వచ్చారు. సాంగోళా తాలూకా మంగేవాడిలో సిమెంట్‌తో నిర్మించిన చెరువును ఆయనకు చూపించారు.

అందులో 22.06 టీఎంసీల నీటి నిల్వ ఉంటుందని చూపించారు. కానీ ప్రత్యక్షంగా ఇక్కడ ఆ స్థాయిలో నీటి నిల్వ సాధ్యం కాదు. ఈ విషయాన్ని గ్రామస్తులు, జల నిపుణుల సమక్షంలో కొలతలు నిర్వహించడంతో వెలుగులోకి వచ్చింది. అత్యధికంగా నాలుగు నుంచి ఆరు టీఎంసీల నీటి నిల్వకు మాత్రమే వీలుంటుంది’ అని ప్రఫుల్లా వివరించారు. కేవలం ప్రచారం కోసం అధికారులు పాకులాడుతున్నారని ఆయన విమర్శించారు. దీని వల్ల నీటి సమస్య తీరకపోగా, వ్యయం తడిసి మోపెడవుతుందన్నారు. జిల్లాకు చెందిన శాసనసభ్యులతో సహా ముఖ్యమంత్రిని కలుసుకొని జలయుక్త శివారులోని బోగస్ ఉదంతాలపై పూర్తి స్థాయిలో నివేదిక అందజేస్తానని ప్రఫుల్ల తెలిపారు.

మరిన్ని వార్తలు