భివండీ బంద్

6 Nov, 2013 23:03 IST|Sakshi

 భివండీ, న్యూస్‌లైన్: మహారాష్ట్ర మాంఛెస్టర్‌గా పేరున్న భివండీ బుధవారం స్తంభించింది. పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్త్రపరిశ్రమల యజమానులు బుధవారం నుంచి ఈ నెల 15 వరకు బంద్ పాటిస్తున్నారు. దీంతో పట్టణంలో ఉన్న సుమారు 10 లక్షల మరమగ్గాలు, ఇతర యంత్రాలు నిలిచిపోయాయి. భివండీ పవర్‌లూమ్ సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఆరు నుంచి 15 వరకు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది భివండీకి వలస వచ్చారు. వీరిలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర ప్రాంతాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గత కొన్నేళ్లుగా వ్యాపారాలు మందకొడిగా సాగుతుండడంతో వేలాది మంది యజమానులు, లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు.
 
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరమగ్గాల కార్మికుల కోసం సంక్షేమ పథకాలు, ప్రత్యేక సదుపాయాలు కల్పించకపోవడంతో వీరి జీవితాల్లో సంక్షోభాలు తప్పడం లేదు.  సుమారు 12 లక్షలకు పైగా జనాభా ఉన్న భివండీలో 90 శాతం మంది ప్రజలు వస్త్రపరిశ్రమలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ మరమగ్గాల పరిశ్రమలు నడిస్తేనే ఇతర వ్యాపారాలూ నడుస్తాయి. గత మూడు సంవత్సరాల నుంచి నూలు ధరల్లో హెచ్చుతగ్గుల వలన వ్యాపారాలు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో ఇప్పటికే 30 శాతం చిన్నపాటి పరిశ్రమలు మూతబడ్డాయి. మూతబడ్డవాటిలో తెలుగు వారికి చెందిన పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వారు ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఒకటి నుంచి విద్యుత్ చార్జీలను పెంచి పరిశ్రమల యజమానుల నడ్డి విరుస్తోందని భివండీ పవర్‌లూమ్ సంఘర్ష్ సమితి సభ్యులు ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరమగ్గాల యంత్రాలను కిలోల చొప్పున చిత్తు మాదిరిగా అమ్ముకోవాల్సి వస్తుందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 ఇదిలా ఉండగా భివండీ పద్మనగర్ పవర్‌లూమ్ అసోసియేషన్, శాంతినగర్ పవర్‌లూమ్ అసోసియేషన్, అలాగే షోలాపూర్, ఇచ్చల్‌కరేంజీ, సాంగ్లీ, మాలేగావ్, విఠా, సతారా ప్రాంతాల్లోని సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, విద్యుత్‌శాఖ మంత్రి అజిత్ పవార్‌ను గత నెల మూడున కలిసి తమ సమస్యలపై చర్చించారు. మరమగ్గాల కార్మికుల సమస్యను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చినా ఇంత వరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీంతో ప్రభుత్వ వైఖరికి నిరసనగా భివండీ పవర్‌లూమ్ సంఘర్ష్ సమితి నేతృత్వంలో పట్టణంలోని అన్ని పరిశ్రమలను మూసివేసి బంద్ పాటిస్తున్నారు. ముత్యాల ఫ్యాక్టరీలు, డయింగ్ ఫ్యాక్టరీలు కూడా బంద్‌లో పాలొన్నాయి.
 

మరిన్ని వార్తలు