ఫార్మా, డ్రోన్లు, టెక్స్‌టైల్స్‌ పీఎల్‌ఐలో మార్పులు

20 Sep, 2023 02:32 IST|Sakshi

మరిన్ని ప్రోత్సాహకాలకు వీలు త్వరలో ప్రకటించే అవకాశం 

న్యూఢిల్లీ: ఫార్మాస్యూటికల్స్, డ్రోన్లు, టెక్స్‌టైల్స్‌ రంగాలకు సంబంధించి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం(పీఎల్‌ఐ) కింద కేంద్రం మార్పులు చేయనుంది.  ఈ రంగాల్లో తయారీ, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా రాయితీలను పెంచనుంది. ఈ విషయాన్ని ఓ సీనియర్‌ అధికారి అనధికారికంగా వెల్లడించారు. 2021 నుంచి ఇప్పటివరకు 14 రంగాలకు పీఎల్‌ఐ పథకం కింద కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించి, దరఖాస్తులను సైతం స్వీకరించింది.

మంత్రిత్వ శాఖల మధ్య అంతర్గతంగా కొనసాగిన సంప్రదింపుల్లో భాగంగా ఈ రంగాలకు సంబంధించి సవరణలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించినట్టు సదరు సీనియర్‌ అధికారి తెలిపారు. దీనికి త్వరలోనే కేబినెట్‌ ఆమోదం పొందనున్నట్టు పేర్కొన్నారు టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌కు నిర్వచనం మార్చనున్నట్టు చెప్పారు. అలాగే, డ్రోన్లు, డ్రోన్ల విడిభాగాలకు కేటాయించిన రూ.120 కోట్లను పెంచనున్నట్టు వెల్లడించారు. వైట్‌ గూడ్స్‌ (ఏసీ, ఎల్‌ఈడీ లైట్లు) రంగాలకు పీఎల్‌ఐ కింద నగదు ప్రోత్సాహకాలను ఈ నెల నుంచే విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.

2023 మార్చి నాటికి రూ.2,900 కోట్లను ఇవ్వాల్సి ఉందన్నారు. పీఎల్‌ఐ కింద వైట్‌ గూడ్స్, వైద్య పరికరాల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఆహారోత్పత్తులు తదితర 14 రంగాలకు కేంద్రం రూ.1.97 లక్షల కోట్లను ప్రకటించింది. అయితే, కొన్ని రంగాలకు సంబంధించి పెద్దగా పురోగతి కనిపించలేదు.

దీంతో కొన్ని రంగాలకు సంబంధించి మార్పులు చేయాల్సి రావచ్చని కేంద్ర వాణిజ్య శాఖ అధికారి లోగడ సంకేతం ఇవ్వడం గమనార్హం. ముఖ్యంగా అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌ (ఏసీసీ) బ్యాటరీలు, టెక్స్‌టైల్స్‌ ఉత్పత్తులు, స్పెషాలిటీ స్టీల్‌ రంగాల్లో పీఎల్‌ఐ పట్ల పెద్దగా స్పందన లేకపోవడంతో మార్పులకు కేంద్రం పూనుకున్నట్టు తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు