అమ్మను మించిన అమ్మ

3 Jul, 2017 09:05 IST|Sakshi
అమ్మను మించిన అమ్మ

తాము జన్మనిచ్చిన ఒకరిద్దరు పిల్లల్ని ఉదయం నిద్రలేపడం.. వారి అల్లరిని భరించి స్నానం చేయించడం.. టిఫిన్‌ తినిపించి.. హోం వర్క్‌ చేయించి బడికి పంపేటప్పటికే అమ్మలు అలసిపోతున్నారు. సాయంత్రం మళ్లీ పిల్లలు ఇంటికి వచ్చినప్పటి నుంచి వాళ్లను నిద్రపుచ్చే వరకు అమ్మ అవస్థలు చెప్పలేం. కానీ పదకొండేళ్లుగా అనాథలు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న వారిని 300 మంది ఆలనాపాలన చూస్తోంది ఈ అమ్మను మించిన అమ్మ.

కేకేనగర్‌: వేలకు వేలు ఫీజులు పోసి చదివిస్తున్న పాఠశాలలకు వచ్చే పిల్లలు క్రమశిక్షణగా ఉండకపోతే వెంటనే ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు ఎస్‌ఎంఎస్‌ పంపుతున్నారు. అలాంటి రోజుల్లో అనాథ పిల్లలకు తల్లి, తండ్రి.. గురువు.. దైవం.. అన్నీ తానై నిలుస్తోంది ఓ ప్రేమమూర్తి. ఆమె తిరువణ్ణామలై జిల్లా జవ్వాదు పర్వత ప్రాంతంలోని హాస్టల్‌తో కూడిన ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు మహాలక్ష్మి. ఈ పాఠశాలలో మొత్తం 300 మంది విద్యార్థులు హాస్టల్లో బసచేసి చదువుతున్నారు. వారిలో చాలామంది అనాథలు. మరికొందరు సమీప ప్రాంతంలోని గిరిజనుల బిడ్డలు.

2006వ సంవత్సరంలో మహాలక్ష్మి ఈ పాఠశాలకు ఉపాధ్యాయురాలిగా వచ్చారు. మొదటిరోజు బడిలో పిల్లలన్ని చూస్తే అంతా జుట్టు పెంచుకుని, మాసిన బట్టలతో కనిపించారు. అందరూ శుభ్రంగా క్రాప్‌ చేసుకుని, ఉతికిన బట్టలు వేసుకుని రావాలని ఆమె పిల్లలకు చెప్పారు. మరుసటి రోజు నుంచి సగం మంది పిల్లలు స్కూలుకు రావడం మానేశారు. అసలు సంగతి ఏంటని వాకబు చేశారు. వారందరికీ క్రాప్‌ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవని తెలిసింది. దీంతో ఆమె తల్లిడిల్లిపోయింది. మరుసటి రోజు నుంచి పిల్లలకు ఆమే స్నానం చేయించడం.. గోరుముద్దలు తినిపించడం.. పాఠశాల సమయం అయిపోయాక వారిని ఆడించడం మొదలుపెట్టారు. వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. చివరకు జుట్టు పెరిగి ఉన్న పిల్లలకు తానే క్రాప్‌ చేయడం ప్రారంభించారు. మొదట్లో తెలిసినట్లు ఎలాగో జుట్టు కత్తిరించారు. ఒకరికి క్రాప్‌ చేసేందుకు అరగంట పట్టింది. అయినా సరిగ్గా రాకపోవడంతో ఆమె సంతృప్తి చెందలేదు. కొద్దిరోజులు సెలూన్‌కు వెళ్లి క్రాప్‌ చేయడం నేర్చుకున్నారు. ఆ తర్వాత పది నిమిషాల్లో క్రాప్‌ చేసి వారికి స్నానం చేయిస్తున్నారు.

పిల్లల మొహంలో చిరునవ్వు చూడాలని..
తల్లిదండ్రులు లేని అనాథలు.. అమ్మానాన్న ఉన్నా వారికి దూరంగా ఉన్న వారిలో చిరునవ్వు చూడాలనుకున్నాను. పాఠశాలలో వారికి విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు.. వారికి అమ్మా నాన్న లేని లోటు తీర్చాలనుకున్నాను. వారికి సేవ చేయడంలో నాకు ఎంతో తృప్తిగా ఉంది. వారంతా నా బిడ్డలుగానే భావిస్తున్నాను. – మహాలక్ష్మి

మరిన్ని వార్తలు