Weather Update: ఉత్తరాదిన పొగమంచు.. దక్షిణాదిన భారీ వర్షాలు!

18 Nov, 2023 08:54 IST|Sakshi

బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాను అటు దేశరాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పొగమంచులో కప్పుకుని పోయేలా చేస్తే... ఇటు దక్షిణాదిలో భారీ వర్షాలకు కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుపాను ప్రభావం కారణంగా ఇప్పటికే రాజధాని ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో విజిబిలిటీ బాగా తగ్గిపోయిందని, కనిష్ట ఉష్ణోగ్రతలు 13 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి అని భారత వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రతలు 28.2 డిగ్రీ సెల్సియస్‌గా నమోదు కావడం గమనార్హం. 

బంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘మిధిలీ’ తుఫాను ప్రస్తుతం బంగ్లాదేశ్‌ తీరం దాటింది. కానీ దీని ప్రభావం ఈశాన్యం నుంచి అండమాన్ నికోబార్ వరకు కనిపిస్తోంది. ఫలితంగా భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.మరోవైపు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తోపాటు యూపీలోనూ చలిగాలులు వీస్తున్నాయి. అండమాన్ నికోబార్ దీవులు, మిజోరాం, త్రిపురసహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల సమీపంలో గంటకు 50-60 కిలోమీటర్ల నుండి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మత్స్యకారులు తీర ప్రాంతాలకు వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు.

తమిళనాడులో..
ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో ఎడతెరిపిలేకుండా  వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరడంతో జనం పలు అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల చెట్లు కూలడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈశాన్య రుతుపవనాల కారణంగా  తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. కడలూరు, మైలదుతురై, నాగపట్నం, తిరువారూర్‌, పుదుచ్చేరిలోని కారైకల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, తంజావూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈ ఐదు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  భారీ వర్షాల నేపధ్యంలో తమిళనాడులోని పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. చెన్నై, తిరువళ్లూరు జిల్లాలోని విద్యాసంస్థలు మూతపడ్డాయి. అలాగే పుదుచ్చేరి, కారైకల్‌లలో పాఠశాలలు, కళాశాలలకు కూడా సెలవు ప్రకటించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. 
ఇది కూడా చదవండి: 15 ఏళ్లకే అమ్మ.. 33కు అమ్మమ్మ.. కొత్త ట్విస్ట్‌ ఇదే!
 

మరిన్ని వార్తలు