‘రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి’

16 Sep, 2016 20:39 IST|Sakshi

రాయలసీమలో హైకోర్టు బెంచ్‌తోపాటు స్టీల్‌ప్లాంట్, రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని రాయలసీమ రాష్ట్ర సమితి (ఆర్‌ఆర్‌ఎస్) అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ స్థితిగతులను పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారన్నారు. సహజ వనరులు పుష్కలంగా ఉన్నా అభివృద్ధికి ఆమడదూరంలో ఉందన్నారు.

 

తక్షణమే కడపలో స్టీల్‌ప్లాంట్, గుంతకల్లులో రైల్వేజోన్, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేసి సీమను అభివృద్ధి పరచాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి కరువునుంచి కాపాడాలని కోరారు. లేనిపక్షంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తెరపైకి వస్తుందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందగా ప్రస్తుత పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రాజధాని పేరుతో అభివృద్ధిని రెండు జిల్లాలకే పరిమితం చేస్తున్నారన్నారు. నిధులను దోచుకునేందుకే ప్యాకేజీని స్వాగతిస్తున్నామంటూ అధికార పార్టీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నారు. ఉయ్యలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తితో రాయలసీమ అభివృద్ధికి పాటుపడతామన్నారు. ఈ సమావేశంలో రాయలసీమ రాష్ట్ర సమితి కార్యదర్శి పోలా శివుడు, సంయుక్త కార్యదర్శి ఇంటి యల్లారెడ్డి, అహ్మద్‌బాషా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు