గోరేగాంలో ఎఫ్‌ఓబీ ప్రారంభం

26 Oct, 2014 23:28 IST|Sakshi

ముంబై:  ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని గోరేగావ్ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్‌బ్రిడ్జిని శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఎలాంటి అర్భాటం లేకుండా ఈ బ్రిడ్జిని ప్రారంభించడంపై ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రిడ్జికి దక్షిణ, ఉత్తర దిశల్లో ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాలు ఉన్నాయి. దీంతో రైల్వే స్టేషన్‌లో రద్దీ త్వరగా తగ్గనుందని పశ్చిమ విభాగ రైల్వే అధికారి ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ స్టేషన్‌లో ప్రస్తుతం మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి నిరంతరం రద్దీగానే ఉంటున్నాయి. రద్దీ కారణంగా ప్రయాణికులు సుమారు ఐదారు నిమిషాలపాటు బ్రిడ్జి ఎక్కడానికి వేచి చూడాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా, ప్లాట్‌ఫాం నం. 02, 04 చాలా దారుణంగా ఉన్నాయి. ఒకేసారి రెండు రైళ్లు ప్లాట్‌ఫాంపైకి వస్తే విపరీతమైన రద్దీ నెలకొంటోంది. ఈ కొత్త ఎఫ్‌ఓబి నిర్మాణంతో మిగతా ఎఫ్‌ఓబీలపై ప్రయాణికుల భారం కొంత మేర తగ్గనున్నట్లు అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు.

 కాగా, ఈ స్టేషన్‌లో పశ్చిమ దిశలో హార్బర్‌లైన్ రైళ్లకోసం కొత్తగా ప్లాట్‌ఫాం నిర్మిస్తున్నారు. దీనికి ఎఫ్‌ఓబీని కలపనున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. ఇది పూర్తిగా ఉపయోగం లోకి వచ్చిన తర్వాత దీనిని తిరిగి గోరేగావ్ పశ్చిమంలో ఉన్న ఎమ్మెమ్మార్డీఏ స్కైవాక్‌తో కూడా కనెక్ట్ చేయనున్నారు. దీని ద్వార వే లాదిమంది ప్రయాణికులు ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా ఐదవ బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి కానున్నదని చెప్పారు.  దీనిని కూడా మరో రెండు నెలల్లో ప్రారంభించనున్నామని ఆయన వివరించారు. దీనిపై టికెట్ బుకింగ్ విండోను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సదరు అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ.. రద్దీ కారణంగా క్యూలో నిల్చోవడం ఎంతో కష్టంగా ఉందన్నారు. దీంతో కొత్త ఎఫ్‌ఓబీలను ఏర్పాటు చేయాలని పలు మార్లు ఫిర్యాదు చేశామన్నారు. ఇటీవల ఇక్కడ వాణిజ్య, గృహ సముదాయాలు ఎక్కువగా ఏర్పడ్డాయని, దీంతో ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోందని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు