కాంగ్రెస్‌లో ముసలం

28 Jan, 2015 01:13 IST|Sakshi
కాంగ్రెస్‌లో ముసలం

చెన్నై, సాక్షి ప్రతినిధి : తమిళనాడు కాంగ్రెస్‌లో చిదంబరం రూపంలో కొత్త ముసలం బయలుదేరింది. మాజీ కేంద్ర మంత్రి జీకే వాసన్ కొత్త పార్టీ స్థాపనతో బలహీనపడిన రాష్ట్రశాఖ, పీ చిదంబరం వేరుకుంపటితో మరో చీలిక ఏర్పడనుంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో జీకే వాసన్, పీ చిదంబరం, తంగబాలు, కృష్ణస్వామి, ఇళంగోవన్ ఇలా అనేక వర్గాలు ఉన్నాయి. ఎవరి బలాలు వారికున్నాయి. జీకేవీ అనుచురుడైన జ్ఞానదేశికన్ టీఎన్‌సీసీఅధ్యక్షులుగా ఉన్నపుడు మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్, సీనియర్ నేత జీకే మూపనార్ బొమ్మలను ప్రచారాల్లో వాడరాదని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. ఈ ఆదేశాలు కామరాజర్, మూపనార్ అభిమానుల్లో ఆగ్రహం తెప్పించారుు. ఇదే అదనుగా మూపనార్ తనయుడు జీకే వాసన్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి ఏకంగా వేరే పార్టీనే పెట్టేశారు.

రాష్ట్రంలోని 23 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే పార్టీలో చేరిపోయారు. జీకే వాసన్ వేరుకుంపటి కారణంగా వలసబాట పట్టిన 23 జిల్లాల్లోని అధ్యక్ష స్థానాలను తనవర్గం వారితో భర్తీ చేయాలని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఇళంగోవన్‌ను పీ చిదంబరం కోరారు. అయితే ఇందుకు ఇళంగోవన్‌తోపాటూ ఇతర వర్గ నేతలు సైతం సమ్మతించలేదు. తన మాటను కాదన్నారన్న అక్కసుతో ఇళంగోవన్‌పై అధిష్టానానికి చిదంబరం ఫిర్యాదులు చేశారు. అధిష్టానం చిదంబరం ఫిర్యాదులను లెక్కచేయకపోగా మందలించినట్లు వ్యవహరించింది. రాష్ట్రంలో కామరాజనాడార్ పాలనను తీసుకువస్తామని చేస్తున్న కాంగ్రెస్ ప్రచారాలను కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం తప్పుపట్టారు.

పార్టీ సమావేశాల్లోనే విమర్శలు గుప్పించారు. ప్రజాకర్షణ కలిగిన నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మనుగడ అని వ్యాఖ్యానించారు. తన అనుచరులతో ఈనెల 22న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి రాష్ట్ర కాంగ్రెస్ నుంచి షోకాజ్ నోటీసు అందుకున్నారు. కార్తీ వ్యాఖ్యలు, ఇళంగోవన్ షోకాజ్ నోటీసు వెనుక ఇరువర్గాల మధ్య అంతర్యుద్ధం సాగుతున్న విషయం బట్టబయలైంది. తన కుమారుడి ముసుగులో అసంతృప్తిని వెళ్లగక్కిన చిదంబరం కాంగ్రెస్ నుంచి వైదొలిగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొత్త పార్టీ పెట్టడమా, గతంలో ఉన్న ప్రజా కమిటీని పునరుద్ధరించడమా అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. చిదంబరం కొత్త పార్టీ ఆలోచనల సమాచారం తెలిసినందునే కార్తీకి ఇళంగోవన్ షోకాజ్ నోటీసు జారీచేశారని తెలుస్తోంది.

అధిష్టానానికే ఆ హక్కు: కార్తీ
 తాను ఏఐసీసీ సభ్యుడిగా ఉన్నా అధిష్టానానికి మాత్రమే తాను సంజాయిషీ ఇచ్చుకుంటానని కార్తీ చిదంబరం మంగళవారం వ్యాఖ్యానించారు. పార్టీకి విరుద్ధంగా తానేదైనా తప్పు చేసి ఉంటే ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది, తనకు షోకాజ్ నోటీసు ఇచ్చే అధికారం టీఎన్‌సీసీకి లేదని ఆయన వ్యాఖ్యానించారు.

చిదంబరానికి ఓట్లు పడవు : ఇళంగోవన్
  కార్తీ చిదంబరం ఆశిస్తున్నట్లుగా ఆయన తండ్రి చిదంబరాన్ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు నుంచి కూడా ఓట్లు పడవని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ మంగళవారం ఎద్దేవా చేశారు. కామరాజనాడార్‌ను విమర్శించడమేగాక కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రిగా ఆయన పాలన ముగిసిన అనంతరం పుట్టిన కార్యకర్తలతో జీ 67 (1967) పేరుతో సమావేశం నిర్వహించడం శోచనీయమన్నారు. కామరాజర్ తరువాత సీఎం అభ్యర్థిగా ప్రకటించే స్థాయి గల నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్‌లో లేడని ఆయన వ్యాఖ్యానించారు. పీ చిదంబరం పార్టీని వీడిపోయినా నష్టం లేదన్నారు. ఆనాడు రాజాజీ వెళితేనే పార్టీకి ఏమీ కాలేదని చెప్పారు. కాంగ్రెస్‌కు అంటూ రాష్ట్రంలో కొన్ని ఓట్లు ఉన్నాయని, చిదంబరంను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే పడే ఓట్లు కూడా పడవని ఎద్దేవా చేశారు.

 

>
మరిన్ని వార్తలు