దివంగత రావూరి భరద్వాజకు శ్రీకృష్ణదేవరాయ పురస్కారం

24 Oct, 2013 03:20 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : బడుగుల జీవితాలను అక్షరబద్ధం చేసి, ‘పాకుడురాళ్ల’తో జ్ఞానపీఠాన్ని అధిరోహించి, ఇటీవల నింగికెగిసిన తెలుగు తేజం దివంగత రావూరి భరద్వాజకు తెలుగు విజ్ఞాన సమితి ‘శ్రీకృష్ణదేవరాయ పురస్కారాన్ని’ ప్రకటించింది. రావూరి భరద్వాజ తరఫున ఆయన మనువరాలు సౌమ్య భరద్వాజ ఈ అవార్డును అందుకోనున్నారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎ.రాధాకృష్ణ రాజు ఈ విషయాన్ని తెలియజేశారు.

ఈ నెల 26న తెలుగు విజ్ఞాన సమితి 61వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డును అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ‘ప్రతి ఏడాది సమితి వ్యవస్థాపక దినోత్సవం రోజున ‘శ్రీకృష్ణదేవరాయ పురస్కారాన్ని’ అందజేయడం ఆనవాయితీగా వస్తోంది.  25ఏళ్ల తర్వాత తెలుగు సాహిత్యానికి జ్ఞానపీఠ్ అవార్డును అందించిన ప్రముఖ రచయిత డాక్టర్ రావూరి భరద్వాజను ఈ ఏడాది ఆ పురస్కారానికి ఎంపిక చేశాం. అయితే దురదృష్టవశాత్తు ఆయన ఇటీవలే కన్నుమూశారు.

అందుకే ఈ అవార్డును ఆయన మనువరాలు సౌమ్య భరద్వాజ అందుకోనున్నారు’ అని రాధాకృష్ణ రాజు వెల్లడించారు. ఈ నెల 26న నగరంలోని రవీంద్రకళాక్షేత్రలో సాయంత్రం 6.30గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ చంద్రశేఖర కంబార, ఎమ్మెల్యే కె.ఆర్.రమేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు