ప్రేమోన్మాది ఘాతుకం

23 Jun, 2014 00:37 IST|Sakshi

 సాక్షి, చెన్నై:ప్రియురాలు తనకు దక్కడం లేదన్న అక్కసుతో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన పైశాచికత్వాన్ని ప్రియురాలి కుటుంబంపై ప్రదర్శించాడు. ఆమె తల్లిదండ్రులను, అవ్వను కిరాతకంగా కడతేర్చాడు. ప్రియురాలిని సైతం వదిలిపెట్ట లేదు. తీవ్రంగా గాయపడిన యువతి కూడలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శనివారం అర్ధరాత్రి నీలగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. నీలగిరి జిల్లా కూడలూరు సమీపంలోని ఓవెలి భారతీ నగర్‌కు చెందిన జాన్, గిరిజ దంపతుల కుమార్తె సోనా(24).
 
 మూడేళ్ల క్రితం సోనా కేరళ రాష్ర్టం మల్లప్పురంలోని ఓ కేటరింగ్ కళాశాలలో చదువుకుంది. అదే కళాశాలలో రాష్ట్రంలోని వైనాడైకు చెందిన జోనియల్ కుమారుడు లెనిన్(27) కూడా చదువుకున్నాడు. ఇద్దరు చదువుకునే సమయంలో ప్రేమలో పడ్డారు. కలసి మెలిసి తిరిగారు. చదువులు పూర్తయ్యాక కొచ్చిలోని ఓ హోటల్లో ఇద్దరు కలసి పనిచేశారు. ఈ సమయంలో ఏమి జరిగిందో ఏమోగానీ, కొన్నాళ్లకు లెనిన్‌తో సోనాకు విబేధాలు తలెత్తాయి. దీంతో తన స్వగ్రామం ఓవెలికి ఆమె తిరిగి వచ్చేంసింది. లెనిన్‌తో సంబంధాలు తెగ తెంపులు చేసుకునే ప్రయత్నం చేసింది. దుబాయ్‌లోని ఓ హోటల్లో ఉద్యోగం లభించడంతో సోనా మూడు నెలల క్రితం నీలగిరి నుంచి వెళ్లి పోయింది. వివాహ ఏర్పాట్లు:తనకు సోనా దూరం అవుతుండడంతో తీవ్ర మానసిక వేదనకు లెనిన్ లోనయ్యాడు.
 
 ఆమె కోసం పలు మార్లు ఓవెలికి వచ్చి వెళ్లినట్టు సమాచారం. పదిహేను రోజుల క్రితం దుబాయ్ నుంచి ఓవెలికి సోనా వచ్చింది. తమ కుమార్తెకు జోషప్ అనే వ్యక్తితో పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు నిర్ణయించారు. రెండు రోజుల క్రితం నిశ్చితార్థం సైతం జరిగినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న లెనిన్ కోపోద్రిక్తుడయ్యాడు. శనివారం మధ్యాహ్నం ఓవెలికి తన మిత్రులతో కలసి చేరుకున్నాడు. అక్కడి ఓ హోటల్లో బస చేశాడు. కిరాతకం: రాత్రి తన మిత్రులతో కలసి సోనా ఇంటికి వద్దకు వెళ్లాడు. మిత్రులను కూత వేటు దూరంలో వదలి పెట్టి వెనుక దారి గుండా లోనికి వెళ్లిన లెనిన్ అక్కడున్న సోనా తల్లి గిరిజ , అవ్వ అమ్ములుతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. తాను సోనాను ప్రేమిస్తున్నానని, తనకు ఇచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి తెచ్చాడు. తమ కుమార్తెకు నిశ్చితార్థం సైతం జరిగి పోయిందని వారు నచ్చచెప్పినా లెనిన్ పట్టించుకోలేదు. సోనాను తన వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
 
 ఇందుకు ఆమె నిరాకరించడంతో ఉన్మాదిగా మారాడు. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన సోనా తండ్రి జాన్ లెనిన్‌ను వారించాడు. మరింత కోపోద్రిక్తుడైన లెనిన్ ఆ ఇంటి బయట ఉన్న గడ్డ పారను చే త బట్టి వీరంగం సృష్టించారు. గిరిజ, అమ్ము, జాన్ తలలను పగల కొట్టాడు. అడ్డొచ్చిన సోనా మీద దాడి చేశాడు. దీంతో సంఘటనా స్థలంలో నే గిరిజ, అమ్ములు మృతి చెందారు. రక్తగాయాలతో సోనా, జాన్‌లు పెడుతున్న కేకలు విన్న ఇరుగు పొరు గు వారు పరుగులు తీశారు. పారిపోతున్న లెనిన్‌ను, అతడి మిత్రుల్ని పట్టుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న జాన్, సోనాలను కూడలూరు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స ఫలించక జాన్ మృతిచెం దగా, సోనా ప్రాణాలతో కొట్టు మిట్టాడుతోంది.
 
 కలకలం: ప్రేమోన్మాది దాడి సమాచారం ఉదయాన్న నీలగిరి జిల్లాల్లో కలకలం రేగింది. సమాచారం అందుకున్న ఆ జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్, కలెక్టర్ శంకర్, ఎంపీ గోపాలకృష్ణన్, తాడ్కో అధ్యక్షుడు కలై సెల్వన్‌లు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోనాను పరామర్శించారు. అయితే, ఆమె తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉండడంతో, మెరుగైన వైద్య సేవలు అందించాలని అక్కడి డాక్టర్లకు సూచించారు. భారతీ నగర్ వాసులకు చిక్కిన లెనిన్, అతడి మిత్రులను న్యూ ఒవెన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రేమోన్మాది లెనిన్‌ను కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
 

>
మరిన్ని వార్తలు