'మీ కుటుంబాలతో అంతా బాగానే ఉన్నారుగా'.. విశాల్ వ‍్యంగ్యాస్త్రాలు!

5 Dec, 2023 16:14 IST|Sakshi

మిచౌంగ్‌ తుపాను ధాటికి తమిళనాడు ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. రెండు రోజులు విరుచుపడుతున్న మిచౌంగ్ తుపాను ఇవాళ ఉగ్రరూపం దాల్చింది. చెన్నైలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా ఐదుగురు మరణించగా.. చాలామంది ఇంకా వరద ముంపులోనే ఉన్నారు. దీంతో వరదలను నివారించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ స్టార్ హీరో విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు చెన్నై మేయర్ ప్రియా రాజన్,  గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. 

విశాల్ తన ట్వీట్‌లో రాస్తూ..' ప్రియమైన శ్రీమతి ప్రియా రాజన్ (చెన్నై మేయర్), కమిషనర్‌తో సహా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌లోని ఇతర అధికారులు సురక్షితంగా మీ కుటుంబాలతో బాగా ఉన్నారని ఆశిస్తున్నా. ఎందుకంటే వరద నీరు, డ్రైనేజీ మీ ఇళ్లలోకి ప్రవేశించదు. మరీ ముఖ్యంగా మీకు ఆహారం, విద్యుత్ సరఫరా ఉంటుందని ఆశిస్తున్నా. మీరు ఉన్న ఇదే నగరంలో నివసిస్తున్న పౌరులుగా మీలా సురక్షితమైన స్థితిలో లేరు. డ్రైనేజీ కాలువ ప్రాజెక్ట్ మొత్తం సింగపూర్ కోసమా? లేదా చెన్నై కోసమా?' అంటూ నిలదీశారు.

అంతే కాకుండా.. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు 2015లో మేమే రోడ్లపైకి వచ్చాం. మళ్లీ 8 ఏళ్ల తర్వాత ఇంత అధ్వాన్నమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకు తెలియజేయగలరని కోరుతున్నా. మేం ఆపదలో ఉన్నప్పుడు వారికి ఆహారం, నీరు అందిస్తూనే ఉంటాం. కానీ  ఈ సమయంలో ప్రతి నియోజకవర్గానికి చెందిన ప్రతినిధులందరూ బయటకు వచ్చి సహాయం చేయాలని కోరుకుంటున్నా. ఈ విషయాన్ని చెప్పేందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా. అద్భుతం కోసం ఎదురుచూడకుండా సాధారణ పౌరులే డ్యూటీ చేయాలి. గాడ్ బ్లెస్' అంటూ పోస్ట్ చేశారు.  కాగా.. విశాల్ ఇటీవలే మార్క్ ఆంటోనీ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. 

>
మరిన్ని వార్తలు