ఇది నాటకం కాదు !

27 Apr, 2016 13:20 IST|Sakshi
ఇది నాటకం కాదు !

 ‘ఇది నాటకం కాదు...ఆలోచించి...పరిశీలించి... సమీక్షించి తీసుకున్న నిర్ణయం’ అని ఎండీఎంకే నేత వైగో వ్యాఖ్యానించారు. ఎన్నికల రేసు నుంచి తాను తప్పుకున్న వ్యవహారం గురించి పై విధంగా స్పందించారు. అదే సమయంలో తప్పుకుంటూ తమ మీద నిందల్ని వేయడాన్ని డీఎంకే తీవ్రంగా పరిగణించింది. వైగో వ్యాఖ్యలను డీఎంకే దళపతి తీవ్రంగా  దుయ్యబట్టారు. ఓటమి భయంతో తప్పుకున్నారని ఎద్దేవా చేశారు.
 
 సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నిల కేసు నుంచి తాను తప్పుకుంటున్నట్టుగా ఎండీఎంకే నేత వైగో ప్రకటించిన విషయం తెలిసిందే. రెండుదశాబ్దాల అనంతరం బరిలో దిగడం ఏమిటో, తప్పుకోవడం ఏమిటీ..? అని పెదవి విప్పే వాళ్లు పెరిగారు. అలాగే,  2011లో ఎన్నికల్ని బహిష్కరించి, అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరించినట్టే, ఇప్పుడు కూడా అదే బాటలో ఉన్నట్టుందన్న ఆరోపణలు బయలు దేరాయి. ఇదంతా ఓ నాటకం అన్న విమర్శలు వస్తుండడం, ఇక, వైగో శకం ముగిసినట్టే అన్న సెటైర్లు బయలు దేరడంతో మంగళవారం మీడియా ముందుకు వైగో వచ్చారు. తాను రేసు నుంచి తప్పుకున్న కోవిల్‌పట్టి నుంచే మీడియాతో మాట్లాడారు.
 
  తానేదో నాటకం రచించినట్టు, దానిని ఆచరణలో పెడుతున్నట్టు ఆరోపణలు గుప్పిస్తున్నారని మండి పడ్డారు. ఇది నాటకం కాదు...ఆలోచించి.. పరిశీలించి...సమీక్షించి తీసుకున్న నిర్ణయంగా వివరించారు. తనను అడ్డం పెట్టుకుని కులచిచ్చు రగిల్చేందుకు కుట్ర చేస్తుండడంతోనే ఎన్నికలకు దూరంగా ఉన్నానన్న తన వాదనను సమర్థించుకున్నారు. తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునస్సమీక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కోవిల్‌పట్టి బరిలో వినాయక రమేష్ కొనసాగుతారని, ఇందులో ఎలాంటి మార్పులేదని తేల్చారు.
 
  ఇక, వైగో ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న వ్యవహారంపై కూటమిలోని నాయకుల్లో ఒక్క తిరుమావళవన్, వాసన్ మాత్రం స్పందించారు. పునస్సమీక్షించాలని తిరుమా సూచిస్తే, వాసన్ మాత్రం ఆహ్వానించడం గమనార్హం. ఇక, ఆ కూటమిలో వైగో తీరుతో గందరగోళం బయలుదేరినట్టు స్పష్టం అవుతోంది. వైగో నిర్ణయంతో ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారాలకు దూరంగా ఉండే పనిలో పడడంతో, సీఎం అభ్యర్థి కెప్టెన్ విజయకాంత్ జట్టును గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తారా? అన్న ప్రశ్నతో కూడి సెటైర్లు బయలు దేరాయి. ఇక, వామపక్ష నాయకులు నోరు మెదపకపోవడం గమనార్హం. భయంతో విమర్శ : ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటూ నిందల్ని తమ మీద వేయడాన్ని డీఎంకే తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల ప్రచారంలో ఉన్న
 
 స్టాలిన్ వైగో పేరు కూడా పలకకుండా తీవ్రంగా దుయ్యబట్టారు. ఓటమి భయం వారికి స్పష్టంగా కన్పిస్తున్నదని, అందుకే రేసు నుంచి తప్పుకున్నారంటూ ఎద్దేవా చేశారు. రేసు నుంచి తప్పుకుని ఉంటే, ఆయన గురించి స్పందించాల్సిన అవసరం తనకు లేదని, అయితే, డీఎంకే మీద నింద వేయడం వల్లే స్పందిస్తున్నానని మండి పడ్డారు. డీఎంకే ఈ ఎన్నికల్లో పతనం కావాలన్న కాంక్షతో ఆయన ఆధారరహిత ఆరోపణలు గుప్పిస్తున్నారని , దీనిని బట్టి చూస్తే, ఆయన ఎ వరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో ఆ కూటమి వర్గాలే అర్థం చేసుకోవాలని ఎద్దేవా చేశారు. దిగజారుడు వ్యాఖ్యలు మానుకుంటే మంచిదని, లేదంటే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక, వైగో తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ వ్యాఖ్యనిస్తూ, నామినేషన్ వేయడానికి అన్ని సిద్ధం చేసుకుని వచ్చి, చివరకు వెనక్కు తగ్గడంలో ఆంతర్యమేమిటో అని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమ కూటమితో రాష్ట్రానికి  ఒరిగేదిమీ లేదని, అయితే, ఎవరికో మంచి చేయడానికి ఈ కూటమి తెర మీదకు వచ్చిందన్న విషయం వైగో తీరుతో స్పష్టం అవుతోందని అనుమానం వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు