Tamil Nadu Raj Bhavan: తమిళనాడు రాజ్‌భవన్‌పై పెట్రో బాంబుల దాడి.. హైఅలర్ట్‌

25 Oct, 2023 19:07 IST|Sakshi

చెన్నై: తమిళనాడు రాజ్‌భవన్‌ వద్ద పోలీసులు బుధవారం హైఅలర్ట్‌ ప్రకటించారు. ఓ వ్యక్తి పెట్రోల్‌ బాంబులతో రాజ్‌భవన్‌పై దాడికి పాల్పడడమే అందుకు కారణం. అయితే ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. రాజ్‌భవన్‌ మెయిన్‌ గేట్‌ వద్ద బారికేడ్లు మాత్రం ధ్వంసం అయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. 

బుధవారం మధ్యాహ్నాం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రెండు పెట్రోల్‌ బాంబుల్ని రాజ్‌భవన్‌ మెయిన్‌ గేట్‌ వద్దకు విసిరేశాడు ఆగంత​​కుడు. ఆ ధాటికి బారికేడ్లు ధ్వంసం అయ్యాయి. రోడ్డు కొంత భాగం దెబ్బ తింది.  వెంటనే అతన్ని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని కారుకా వినోద్‌గా గుర్తించారు. ఘటన సమయంలో గవర్నర్‌ రాజ్‌భవన్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

సైదాపేట కోర్టు బయట పార్క్‌ చేసిన ఉన్న బైకుల నుంచి పెట్రోల్‌ దొంగతనం చేసిన వినోద్‌.. రాజ్‌భవన్‌ వైపు నడుచుకుంటూ వచ్చాడు. నెమ్మదిగా ఆ రెండు బాటిళ్లకు నిప్పటించి మెయిన్‌ గేట్‌ వైపు విసిరాడు. నీట్‌ బిల్లు.. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. అయితే ఈలోపు అప్రమత్తమైన పోలీస్‌ సిబ్బంది.. అతన్ని నిలువరించారు. అతని నుంచి మరో రెండు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నీట్‌ బిల్లుకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి క్లియరెన్స్‌ ఇవ్వకపోవడం వల్లే వినోద్‌ ఈ దాడికి పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. 

ఇక్కడో విషయం ఏంటంటే.. వినోద్‌ 2022లో చెన్నై బీజేపీ కార్యాలయంపైకి పెట్రోల్‌ బాంబులు విసిరిన కేసులో అరెస్ట్‌ అయ్యాడు. మూడు రోజుల కిందటే జైలు నుంచి విడుదలయ్యి వచ్చాడు. ఈ ఘటనపై బీజేపీ, డీఎంకే సర్కార్‌పై మండిపడుతోంది. శాంతి భద్రతలను ఈ ప్రభుత్వం ఏస్థాయిలో పరిరక్షిస్తుందో.. రాజ్‌భవన్‌పై జరిగిన దాడి ప్రతిబింబిస్తోందని తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై తన ఎక్స్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు