బాబు ప్రభుత్వం చిచ్చు పెడుతోంది

23 Aug, 2016 02:04 IST|Sakshi
బాబు ప్రభుత్వం చిచ్చు పెడుతోంది

 పళ్లిపట్టు: పాలారులో చెక్‌డ్యాంలు నిర్మించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం సోదర భావంతో ఉంటున్న తమిళం, తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, ఎంపీ అన్బుమణి రాందాస్ అన్నారు. వేలూరు జిల్లా సరిహద్దు ఆంధ్రా ప్రాంతంలోని పాలారులో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఆంధ్రా ప్రభుత్వం చెక్‌డ్యాంలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రభుత్వం తీరుతో తమిళనాడులోని వేలూరు, కాంచీపురం జిల్లాల ప్రజలకు తాగునీటి కష్టాలతోపాటు వ్యవసాయం పూర్తిగా దెబ్బతినే ప్రమాదమున్నందున చెక్‌డ్యాంల నిర్మాణానికి అన్ని పార్టీలు వ్యతిరేకత తెలుపుతున్నాయి.
 
  ఇందులో భాగంగా కాంచీపురం జిల్లాలో సోమవారం చంద్రబాబు ప్రభుత్వం తీరుకు నిరసనగా మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు, ఎంపీ అన్బుమణి రాందాస్ పాల్గొని ప్రసంగించారు. ఆంధ్ర, తమిళనాడులో ఇరు రాష్ట్రాల ప్రజలు సోదరభావంతో మెలగుతున్నారని, అయితే చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇరురాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తోందని అన్నారు.
 
 పాలారు నదిపై ఆధారపడి రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రజలు నివసిస్తున్నప్పటికీ ఆంధ్రా ప్రభుత్వం సరిహద్దు ప్రాంతంలో చెక్‌డ్యాంలు నిర్మించి తమిళనాడులోకి నీరు రాకుండా అడ్డుకుంటున్నట్లు దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం మొండి వైఖరితో రాష్ట్ర ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే  చెక్‌డ్యాంల నిర్మాణాన్ని నిలిపివేసి, ఇప్పటికే  నిర్మించిన వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఇరు రాష్ట్రాల మధ్య శాంతియుత వాతావరణం చోటు చేసుకుంటుందని తెలిపారు. ఆంధ్రా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే పోరాటాలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు