ముసాయిదా తప్పులతడక! | Sakshi
Sakshi News home page

ముసాయిదా తప్పులతడక!

Published Tue, Aug 23 2016 1:58 AM

Warangal without Jangaom Memorandum

- 505 కాదు.. 504 మండలాలే
- ఇల్లందకుంట రెండు కాదు.. ఒకటే
- జనగాం లేకుండానే వరంగల్ ముసాయిదా
- దేవరుప్పుల హన్మకొండలోనా... యాదాద్రిలోనా?
- ఆఖరి నిమిషం వరకు కసరత్తే గందరగోళానికి కారణం
 
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం చూసుకుని మరీ జిల్లాల పునర్విభజన ముసాయిదాను విడుదల చేసినా.. తప్పులతడకగా, గందరగోళంగా తయారైంది. ఆఖరి నిమిషంలో అధికారులు హడావుడిగా చేసిన మార్పులతో నోటిఫికేషన్‌లో తప్పులు దొర్లాయి. కొత్త మండలాల సంఖ్య కూడా కచ్చితంగా లెక్క తేలకపోవడం గమనార్హం. కొత్తగా 17 జిల్లాలు, 15 రెవెన్యూ డివిజన్లు, 46 మండలాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి, జాబితాలను విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 459 మండలాలున్నాయి. కొత్త వాటితో కలిపి 505కు చేరిందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డివిజన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఇల్లందకుంట మండలాన్ని.. వరంగల్ జిల్లాలోనూ చూపింది. అంటే వాస్తవంగా కొత్త మండలాల సంఖ్య 45అని.. మొత్తం మండలాల సంఖ్య 504 అని తేలుతోంది.

 ప్రాంతాల్లోనూ అయోమయం
 తమ ప్రాంతాన్ని కొత్త జిల్లా కేంద్రం చేయాలని ఆందోళనలు చేసిన జనగాం ప్రాంత ప్రజలను ప్రభుత్వం గందరగోళంలో ముంచేసింది. ముసాయిదా నోటిఫికేషన్‌లో ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉన్న మండలాలన్నీ పునర్విభజనతో ఏయే డివిజన్‌లో చేరుతాయి, ఏయే జిల్లాలోకి మారుతున్నాయనే వివరాలన్నీ ఉన్నాయి. కానీ జనగాం పేరును మాత్రం మరిచిపోయారు. అయితే అదే సమయంలో జారీ చేసిన నల్లగొండ జిల్లా నోటిఫికేషన్‌లో మాత్రం కొత్తగా ఏర్పాటైన యాదాద్రి జిల్లాలో జనగాంను చేర్చినట్లు పేర్కొనడం గమనార్హం.

ఇక వరంగల్ జిల్లాలోని దేవరుప్పుల మండలాన్ని అటు హన్మకొండ జిల్లాలోనూ, ఇటు యాదాద్రి జిల్లాలోనూ చూపించారు. సోమవారం సాయంత్రానికి ఈ పొరపాటును గుర్తించిన అక్కడి జిల్లా యంత్రాంగం దేవరుప్పుల మండలం గురించి స్పష్టత ఇవ్వాలని, నోటిఫికేషన్‌కు సవరణ జారీ చేయాలని సీసీఎల్‌ఏ, రెవెన్యూ శాఖల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇక ఖమ్మం జిల్లా నోటిఫికేషన్‌లో గార్ల, బయ్యారం మండలాల ప్రస్తావనే లేదు. రాజకీయ ఒత్తిళ్లతో ఆఖరి నిమిషం వరకు కొత్త మండలాల సంఖ్యలో మార్పులు చేర్పులు చేయటం, అటు ఇటు సర్దుబాటు చేయడం వల్లే ఈ పొరపాట్లు జరిగాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 ముహూర్తం కుదిరిందా..?
 కొత్త జిల్లాల కసరత్తు మొదలైనప్పటి నుంచీ సీఎం కేసీఆర్ తన లక్కీ నంబర్ ప్రకారం 24 జిల్లాలను ఏర్పాటు చేస్తారనే ప్రచారం సాగింది. అలాంటిదేమీ లేదని ముఖ్యమంత్రి స్వయంగా కొట్టిపారేసి 27 జిల్లాలకు ఓకే చెప్పడం అధికార వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. అయితే జిల్లాల ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏరికోరి శుభ ముహూర్తం చూశారు. సోమవారం సరిగ్గా మధ్యాహ్నం 1.42 నిమిషాలకు నోటిఫికేషన్ జారీ చేయాలన్న సీఎం కార్యాలయం సూచన మేరకు రెవెన్యూ విభాగం జిల్లాల పునర్విభజన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అనంతరం 2.30 గంటలకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ముసాయిదా వివరాలను వెల్లడించారు. అయితే ముహూర్తం కుదిరిందా సార్ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘పెళ్లిళ్లకు ముహూర్తం చూసుకోవడం లేదా.. మరి కొత్త జిల్లాలకు చూడాల్సి ఉంటుంది కదా..’ అని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.
 
 తొలిరోజునే 195 విజ్ఞప్తులు
 కొత్త జిల్లాల ముసాయిదాను ప్రకటించిన సోమవారమే ప్ర జల నుంచి 195 అభ్యంతరాలు/విజ్ఞప్తులు అందాయి. సలహాల స్వీకరణ కోసం ప్రారంభించిన వెబ్‌సైట్‌లో సోమవారం రాత్రి వరకు ఈ విజ్ఞప్తులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా యాదాద్రి జిల్లాపై ఉన్నాయి.

Advertisement
Advertisement