పనులు 20 శాతం కూడా పూర్తి కాలేదు

10 May, 2015 22:51 IST|Sakshi

- నాలాలు శుభ్రం చేసే పనులు మందకోడిగా సాగుతున్నాయి
- ఆగ్రహం వ్యక్తం చేసిన బీఎంసీ కార్పొరేటర్లు
- 40 శాతం పనులు పూర్తయ్యాయన్న కార్పొరేషన్
సాక్షి, ముంబై:
నగరంలో మురికి కాల్వలు, నాలాలు శుభ్రపరిచే పనులు 20 శాతం కూడా పూర్తికాలేదని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ప్రతిపక్ష కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా మే మాసం వచ్చే సరికి 50 శాతం మురికి కాల్వలు, నాలాల పనులు పూర్తవుతాయని, కానీ ఈ ఏడాది ఇప్పటి వ రకు పనులు అనుకున్న మేర జరగలేదని కార్పొరేటర్లు ఆరోపించారు. వర్షాకాలానికి ఇంకా నెల రోజులు కూడా సమయం లేదని హెచ్చరించారు. నగరంలో 1.75 లక్షల మురికి కాల్వలు  45 పెద్ద నాలాలు, 38 చిన్న నాలాలు ఉన్నాయి. వీటిలో పేరుకుపోయిన చెత్త, బురద వెలికితీసే పనులు 40 శాతం పూర్తయ్యాయని బీఎంసీ పరిపాలన విభాగం వెల్లడించింది. కాని వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని బీఎంసీలో ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఆంబేకర్ ఆరోపించారు.

కొన్ని ప్రాంతాల్లో నాలాల నుంచి బయటకు తీసిన బురద, చెత్త అలాగే పడి ఉందని, దీంతో దుర్గంధం వ్యాపించడంతో ప్రజలనుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో పనులు మందకోడిగా సాగుతున్నాయన్నారు. ఇచ్చిన సమయానికల్లా కాంట్రాక్టర్లు పనులు పూర్తిచేయాలని నిబంధనలు ఉన్నాయని, అయితే వర్షాకాలం ప్రారంభమైన తర్వాత కూడా నాలాలు శుభ్రం చేసే పనులు కొనసాగుతున్నాయని ఆరోపించారు.

>
మరిన్ని వార్తలు