వేడుకగా పైడితల్లి పందిరిరాట మహోత్సవం

25 Sep, 2016 18:29 IST|Sakshi
-ధర్మపురిలో సిరిమాను సాక్షాత్కారం
-పైడితల్లి ఆలయ పూజారి భాస్కరరావు వెల్లడి
 
విజయనగరం : ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి చదురుగుడి వద్ద పందిరిరాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈఓ భానురాజా, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత, జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ మూర్తి తదితరులు అమ్మవారి పందిరి రాట మహోత్సవంలో పాల్గొన్నారు. 
 
చదురుగుడి అనంతరం రైల్వేస్టేషన్ వద్ద ఉన్న అమ్మవారి వనంగుడి ఆవరణలోనూ రాట మహోత్సవం నిర్వహించారు. అనంతరం ఉత్సవాల్లో కీలకఘట్టమైన సిరిమా నోత్సవానికి సంబంధించి స్దానిక ధర్మపురిలో అమ్మవారి సిరిమాను సాక్ష్యాత్కారమైంది. ధర్మపురి గ్రామంలోని బీసీ కాలనీలో వల్లిపల్లి వెంకటరమణ, ఆదినారాయణల కళ్లాల్లో సిరిగల చింతమాను అక్కడ సాక్షాత్కరించిందని చెప్పారు. సుమారు 65 నుంచి 70 అడుగుల సిరిమాను అక్కడ ఉందన్నారు. నేటినుంచి సిరిమాను తరలించే వరకూ అక్కడ పూజాదికాలు జరుగుతాయన్నారు. అనంతరం మేళతాళాలతో త్వరలోనే హుకుంపేట పూజారి ఇంటికి తరలిస్తామని చెప్పారు. సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పీవీఏవీఎస్.భానురాజా తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు