కరెంటు కొమ్మలు.. సోలార్ చెట్టు!

4 Oct, 2016 03:18 IST|Sakshi
కరెంటు కొమ్మలు.. సోలార్ చెట్టు!

కాలుష్యాన్ని తగ్గించేందుకు, వేసవిలో కరెంటు కోతల ఇబ్బందులను తప్పించుకునేందుకూ సౌరశక్తిని వాడటం మేలు. అయితే ఒక ఇంటికి అవసరమైన సోలార్ ప్యానెల్స్‌ను బిగించుకునేందుకైనా చాలా ఎక్కువ స్థలం అవసరమవుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే సీఎస్‌ఐఆర్ అనుబంధ సంస్థ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇటీవలే ఓ సోలార్ చెట్టును ఆవిష్కరించింది.
 
దాదాపు 400 చదరపు అడుగుల విస్తీర్ణంలోని సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసేంత విద్యుత్తును ఈ సోలార్ చెట్టు పది చదరపు అడుగుల విస్తీర్ణంలోనూ ఉత్పత్తి చేస్తుంది. చెట్ల మాదిరిగానే దీంట్లో ఒక బలమైన లోహపు కాండం ఆధారంగా కొన్ని కొమ్మల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిపై సోలార్ ప్యానెల్స్‌ను బిగిస్తారన్నమాట. ఒక్కో సోలార్ చెట్టుతో దాదాపు 5 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా.. ప్యానెల్స్‌పై పడే దుమ్మూ ధూళిని ఎప్పటికప్పుడు కడిగేసేందుకు దీంట్లో ఓ వాటర్ స్ప్రింక్లర్ సిస్టమ్ కూడా ఉంది.

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇటీవలే ఢిల్లీలో ఈ సోలార్ చెట్టును ప్రారంభించారు. ఈ తరహా సోలార్‌ట్రీ ఒక్కో దాని ఖరీదు దాదాపు 5 లక్షల రూపాయల వరకూ ఉంటుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని మూడు చోట్ల ఈ చెట్లను ప్రయోగాత్మకంగా వాడనున్నారు. భవిష్యత్తులో సూర్యుడి కదలికలకు అనుగుణంగా సోలార్ ప్యానెల్స్ తమ దిశ మార్చుకునేట్టు సరికొత్త సోలార్ చెట్టును అభివృద్ధి చేస్తామని సీఎస్‌ఐఆర్ అంటోంది.

మరిన్ని వార్తలు