ఓరి దేవుడా ...

16 Mar, 2016 01:40 IST|Sakshi

వారంతా ఒకే గ్రామానికి చెందిన నిరుపేద కూలీలు. ఒకరు కూతురుకు మంచి ఉద్యోగం రావాలని.. మరొకరు చేతికొచ్చిన కొడుకుకి అనుకూలమైన పెళ్లి సంబంధం రావాలని.. ఇలా ఎవరికి వారు వేర్వేరు కోర్కెలు మూటగట్టి ఆ ఏడుకొండల వాడిని వేడుకునేందుకు గ్రామం నుంచి బయలుదేరారు. మరో గంటలో తిరుమల చేరుకోవాల్సిన వారిని విధి వెంటాడింది. లారీ రూపంలో మృత్యువు కబలించింది. ఒకే గ్రామానికి చెందిన ఆరుగురిని పొట్టనబెట్టుకుంది. మరో ఎనిమిది మందిని క్షతగాత్రులను చేసింది.  కళ్లెదుటే కన్న బిడ్డలు విగతజీవులుగా పడి ఉండడం చూసి ఆ తల్లులు దేవుడా..! మాకు దిక్కెవరు నాయనా.. అంటూ గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు కంటతడి పెట్టించింది. గుండెల్ని పిండేసే ఈ విషాద సంఘటన మంగళవారం చంద్రగిరి సమీపంలో చోటు చేసుకుంది.
 
 
తిరుపతి కార్పొరేషన్/ తిరుపతి రూరల్/మంగళం /యలహంక : బెంగళూరుకు చెందిన యలహంక సమీపంలోని దేవనహళ్లి తాలూకా, బిల్లమానర హళ్లి గ్రామానికి చెందిన 13 మంది మంగళవారం వేకువ జాము 1.30 గంటలకు టెంపో ట్రావెలర్‌లో తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. దారిమధ్యలో గోవిందనామస్మరణలు చేసుకుంటూ వస్తున్న వారిపై విధి పగబట్టింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో చంద్రగిరి సమీపం రాయలవారి కోట వద్ద ట్రావెలర్ ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ట్రావెలర్‌లో ప్రయాణిస్తున్న మంగళగౌరమ్మ (15), రమ్య (30), పార్వతి (35), సుజాత (35), సురేష్ (30), కిరణ్(డ్రైవర్) (28) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

డ్రైవర్ కునుకుపాటు
టెంపో ట్రావెలర్ వాహన డ్రైవర్ కిరణ్ నిద్రలేమితో బాధపడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలమనేరుకు సమీపంలోనే ఓ వాహనాన్ని ఢీ కొట్టబోయాడు. నిద్రవస్తోందని.. టీ తాగితే నిద్రమత్తు వదులుతుందని చెప్పడంతో అందరూ పలమనేరు సమీపంలోని ఓ షాపు వద్ద ఆగి టీ తాగారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి చంద్రగిరి సమీపంలోకి రాగానే టెంపో డ్రైవర్ మరోసారి కనుకుపాటుకు గురయ్యాడు. అంతే..! జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి కోళ్లమేతతో వస్తున్న లారీని ఢీకొటింది. టెంపోలో నిద్ర మత్తులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గర్భశోకం..: దైవ దర్శనానికి కన్నబిడ్డలతో వచ్చిన ఇద్దరు తల్లులకు గర్భశోకమే మిగిలింది. డిగ్రీ పూర్తి చేసుకున్న కూతురు గౌరమ్మకు మంచి ఉద్యోగం రావాలని, పెళ్లి సంబంధం కుదరాల ని శ్రీవారిని మొక్కుకునేందుకు కన్నబిడ్డతో కలిసి నాగమ్మ బయలు దేరింది. అలాగే తన కొడుక్కి మంచి పెళ్లి సంబంధం రావాలని మరో తల్లి మాలమ్మ బిడ్డతో పాటు (టెంపో డ్రైవర్ కిరణ్) అదే వాహనంలో బయలు దేరింది. ఆ తల్లుల మొర ఏడుకొండల వాడిచెంత వినిపించకముందే మృత్యువు బిడ్డలను బలితీసుకుంది. ఆ తల్లులకు తీరని కడుపు శోకాన్ని మిగిల్చింది. నిర్జీవంగా రోడ్డుపై పడి ఉన్న బిడ్డల్ని తడువుతూ ఆ తల్లులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.  
 
సంఘటనా స్థలాన్ని  పరిశీలించిన అర్బన్ ఎస్పీ
అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి  సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రగిరి నుంచి పనపాకం వరకు ఉన్న జాతీయ ర హదారిని క్షణ్ణంగా పరిశీలించారు.  
 
మృతదేహాలను చూసి సొమ్మసిల్లిన ఎస్పీ గన్‌మన్
అర్బన్ ఎస్పీ సంఘటనా స్థలానికి మంగళవారం తెల్లవారుజామున చేరుకున్నారు. మృతదే హాలను పరిశీలిస్తున్న సమయంలో ఎస్పీ గన్‌మెన్ పార్థసారథి సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అతన్ని 108లో తిరుపతి రుయాకు తరలించారు. శోకసంద్రంలో బిల్లమానర హళ్లి : రోడ్డు ప్రమాదాలంలో గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబబంలో ఆర్తనాదాలు మిన్నంటాయి.
 
 

మరిన్ని వార్తలు