విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం:స్కూల్‌ ఆటో-లారీ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

22 Nov, 2023 13:45 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సంగం శరత్‌ థియేటర్‌ సమీపంలో బుధవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్‌ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో-లారీ ఢీకొట్టడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై పిల్లల్ని ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ పరార్‌ కాగా.. క్లీనర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఈ ప్రమాదంలో విద్యార్థులు హాసిని ప్రియా, జీ.గాయత్రి, వాణి జయ రమ్య, భవేష్‌, లక్ష్య, చార్విక్‌, కుశాల్ కేజీ, కేయూష్ తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదంపై ట్రాఫిక్‌ ఏసీపీ రాజీవ్‌ కుమార్‌ సాక్షితో మాట్లాడారు. ‘‘ఉదయం 7గం.30ని. ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఆటోలో ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. వీళ్లంతా బేతని స్కూల్‌కు చెందిన వాళ్లు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు.  విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటో డ్రైవర్‌ తప్పిదంతోనే ప్రమాదం జరిగిందనేది స్పష్టంగా కనిపిస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం’’ అని ఏసీపీ రాజీవ్‌ అన్నారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థిని పదో తరగతి చదివే హాసినిగా తెలుస్తోంది. 

మరో ప్రమాదంలో..
కాగా, విశాఖలో ఈ ఉదయం మరో ప్రమాదం జరిగింది. మధురవాడ-నగరం పాలెం రోడ్డులో స్కూల్ ఆటో బోల్తా పడింది. ఆటోలో ఏడుగురు స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్నారు. విద్యార్థులు, ఆటోడ్రైవర్‌ స్వల్పంగా గాయపడ్డారు.

చదవండి: ప్రేమా.. ఇదినీకు న్యాయమా?

మరిన్ని వార్తలు