అధికారుల నిర్ణయాలతోనే నష్టాలు

29 Sep, 2016 09:03 IST|Sakshi
► ఆర్టీసీ ఈయూ నాయకుల ధ్వజం

శ్రీకాకుళం : ఆర్టీసీ నష్టాలకు అధికారుల ఏకపక్ష నిర్ణయాలే కారణమని ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు ఎస్‌.వి.రమణ, కె.శంకరరావు ధ్వజమెత్తారు. ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండు రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ ఈయూ ఆధ్వర్యంలో బుధవారం శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీలో అధికారుల సంఖ్య తగ్గించాల్సింది పోయి అందుకు విరుద్దంగా యాజమాన్యం కొత్త కొత్త పోస్టులను సృష్టించి అధికారుల సంఖ్యను అన్ని స్థాయిల్లోనూ పెంచుకుంటూ పోతున్నారన్నారు.  ఖాళీలు ఉన్న చోట్ల కూడా రెగ్యులర్‌ సిబ్బందిని నియమించకుండా అవసరం లేని చోట కొంతమంది ప్రయోజనాల కోసం వందలాది మంది ఔట్‌సోర్సింగ్‌లో నియామకాలు చేసి లక్షలాది రూపాయలు సంస్థకు నష్టం చేకూరుస్తున్నారని దుయ్యబట్టారు.  
 
ఇటీవల గుర్తింపు సంఘం ఎన్నికలో స్వల్ప మెజారిటీతో రాష్ట్ర స్థాయి గుర్తింపులోకి వచ్చిన సంఘం కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు. నిరసన కార్యక్రమంలో ఆర్టీసీ ఈయూ నాయకులు ఎస్‌ఎస్‌ఆర్‌ శర్మ, జి.త్రినాద్, ఆర్‌.జి.రావు, కుమారి, డి.వనజాక్షి, బి.జయదేవ్, ఎంటివి.రావు, బ్రహ్మం, కె.గోవిందరావు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు