ముంబైలోనూ విద్యుత్ చార్జీలు తగ్గించాల్సిందే

23 Jan, 2014 23:11 IST|Sakshi

ముంబై: నగరంలో విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ కార్యదర్శి సంజయ్ నిరుపమ్ శుక్రవారం నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించారు. ఉత్తర ముంబైలోని కాండివలిలో ఉన్న రిలయన్స్ ఎనర్జీ ప్రాంతీయ కార్యాలయం ఎదుట ఆయన దీక్షకు కూర్చున్నారు. ముంబై మినహా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ చార్జీలను 20 శాతం తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ముంబై వాసులకు సైతం ఈ తగ్గింపు వర్తించాలని ఉత్తర ముంబై నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంజయ్ నిరుపమ్ డిమాండ్ చేశారు. నగరంలో విద్యుత్ చార్జీలను తగ్గించినంతవరకు తన పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా 300 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ను వాడుతున్న వినియోగదారులకే ఈ తగ్గింపు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ముంబై నగరంలో ప్రైవేట్ రంగానికి చెందిన టాటా పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ పంపిణీ కంపెనీలు విద్యుత్‌ను పంపిణీ చేస్తున్నాయి. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విద్యుత్ ధర తగ్గింపు నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్షపార్టీ అయిన బీజేపీ తీవ్రంగా ఆరోపించింది.
 
 అయితే దీనికి స్పందించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గత నవంబర్‌లో ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే విద్యుత్ చార్జీలను తగ్గించామే తప్ప రాజకీయ కారణాలేవీ లేవన్నారు. ఈ తగ్గింపు వల్ల వచ్చే రూ.7,200 కోట్ల ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన అన్నారు. కాగా, నగరంలోనూ విద్యుత్ చార్జీలను తగ్గించాలని  కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎంపీ ప్రియాదత్‌తో పాటు నిరుపమ్ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం పృథ్వీరాజ్ చవాన్‌కు నిరుపమ్ లేఖ కూడా రాశారు.‘జాతీయ రాజధాని అయిన ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం 50 శాతం విద్యుత్ చార్జీలను తగ్గించింది. ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరంలో, రాష్ట్రంలో మనం ఎందుకు విద్యుత్ చార్జీలను తగ్గించలేం?..’ అంటూ ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు. ప్రభుత్వం తన లేఖపై స్పందించకపోవడంతో తాను నిరాహారదీక్షకు దిగాల్సి వచ్చిందని నిరుపమ్ తెలిపారు.
 
 దీక్ష తప్పు కాదు కాని..
 నగరంలో విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఎంపీ సంజయ్ నిరుపమ్ నిరవధిక నిరాహారదీక్షకు దిగడం అప్రస్తుత చర్యగా ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం విద్యుత్ చార్జీలను తగ్గించిన ప్రభుత్వం, ముంబై విషయంలో వచ్చే శాసనసభ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించిందన్నారు. విద్యుత్ చార్జీల తగ్గింపు నిర్ణయం తీసుకునేది ప్రభుత్వం లేదా ఎంఈఆర్‌సీ తప్ప రిలయన్స్ ఎనర్జీ కాదని ఆయన నొక్కిచెప్పారు. ‘నిరుపమ్ పోరాటం చేయడంలో తప్పు లేదు కానీ అతడు దీక్ష చేస్తున్న స్థలం మాత్రం కరెక్ట్ కాదు..’ అని ఆయన అన్నారు. ఫ్లైఓవర్లపై సుంకం ఎత్తివేయాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు బీఎంసీ స్థాయీ కమిటీ అధ్యక్షుడు రాహుల్  షెవాలే లేఖ రాయడంపై నవాబ్ మాలిక్ స్పందిస్తూ..‘ ఒకప్పుడు సేనా-బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుంకం వసూలు పద్ధతినే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది తప్ప కొత్తగా చేపట్టిన విధానం కాదు..’ అని అన్నారు. ‘శివసేన-బీజేపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఫ్లైఓవర్ల నిర్మాణంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించింది. నిర్మాణ వ్యయాన్ని సదరు ప్రైవేట్ కంపెనీలు వసూలు చేసుకునేందుకు సుంకం విధానాన్ని ప్రవేశపె
 ట్టింది..’అని ఆయన వివరించారు.
 
 ఇదిలా ఉండగా నగరంలో విద్యుత్ ధరలను 50 శాతం తగ్గించాలని శివసేన డిమాండ్ చేయడంపై ఆయన ఘాటుగా స్పందించారు.‘బీఎంసీలో మీరే అధికారంలో ఉన్నారు.. నగరంలో బెస్ట్ వసూలుచేస్తున్న విద్యుత్ చార్జీలను ముందు తగ్గించండి.. తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడండి..’ అంటూ ఆయన సవాల్ విసిరారు.  
 

>
మరిన్ని వార్తలు