చిక్కుల్లో చిన్నమ్మ

15 Jul, 2017 03:32 IST|Sakshi
చిక్కుల్లో చిన్నమ్మ

క్రైం సినిమాలా లంచంపై కథనం
ఆరునెలల లగ్జరీల ఖర్చు రూ.15 కోట్లని ప్రచారం
సీబీఐ విచారణకు దీప డిమాండ్‌

సీఎం కాబోయి సెంట్రల్‌ జైలు ఖైదీగా మారిన అన్నాడీఎంకే (అమ్మ) ప్రధానకార్యదర్శి శశికళను ఇంకా చెడ్డరోజులు వెంటాడుతున్నాయి. బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో గుట్టుగా కాలం వెళ్లదీస్తున్న చిన్నమ్మకు కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూప రూపంలో చిక్కులు వచ్చిపడ్డాయి.

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జైలుకు వెళ్లిన శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు సాధారణ గదులు,  ఖైదీలందరితో సమానంగా ఆహారం అందజేశారు. డీజీపీ సత్యనారాయణరావు తొలిరోజుల్లో చాలా కఠినంగా వ్యవహరించారు. బైట నుంచి ఆహరం, మందులు వస్తున్నట్లు తెలుసుకుని మండిపడ్డారు.

ఇదే విధానం కొనసాగితే నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తయ్యేనాటికి తమ వారు జీవచ్చవాల్లా మారిపోవడం ఖాయమని ఆందోళన చెందిన ఇళవరసి కుమారుడు వివేక్‌ డీజీపీని మచ్చిక చేసుకునేందుకు అన్నాడీఎంకే బెంగళూరు శాఖ ప్రముఖ నేతను డీజీపీపై ప్రయోగించాడు. చాలా స్ట్రిక్టు ఆఫీసరుగా ప్రచారంలో ఉండే జైళ్లశాఖ ఉన్నతాధికారి ఒకరు స్నేహితులతో కలిసి బెంగళూరు, హైదరాబాద్, దుబాయ్‌లలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నట్లు తెలుసుకున్నారు. వీరి ద్వారా జైలు అధికారిని లైన్లో పెట్టేందుకు హైదరాబాద్‌లో తొలిదశ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో బెంగళూరుకు చెందిన పెద్ద బిల్డర్‌ కూడా పాల్గొన్నాడు.

చర్చల్లో పురోగతి ఫలితంగా బెంగళూరు–హొసూరు రహదారిలో ఉన్న ఎలక్ట్రానిక్‌ సిటీలోని రూ.70 లక్షల విలువైన ఒక ఫ్లాట్‌ను, పెద్ద మొత్తంలో నగదును అందజేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్‌ ముగిసిన వెంటనే జైల్లో శశికళ స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించినట్లు సమాచారం. ప్రత్యేక వంటగది, చెన్నై పోయెస్‌గార్డెన్‌ నుంచి వంటపని వారు, శశికళ కాళ్లు, చేతులకు మసాజ్‌ చేసేందుకు కొందరు వ్యక్తులు యథేచ్ఛగా జైలులోపలికి, బైటకు రాకపోకలు జరిగాయి. రెండో దశ చర్చలకు జైలు తరఫున దుబాయ్‌ నుంచి వ్యక్తులు వచ్చారు. బెంగళూరు శివార్లలోని ఒక ఫాంహౌస్‌లో చర్చలు ముగిసిన తరువాత హైదరాబాద్‌లోని ఒక తోటలో భారీ మొత్తం ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీల కోసం జైళ్ల అధికారి హైదరాబాద్‌–బెంగళూరు మధ్య అనేకసార్లు విమాన ప్రయాణం చేశారని, విమాన ఖర్చులు సైతం శశికళ తరఫు వ్యక్తులే భరించినట్లు సమాచారం.

జైళ్ల నిబంధనలు తోసిరాజని..
జైళ్లలో ఖైదీలు పాటించాల్సిన నిబంధనలను శశికళ పూర్తిగా ధిక్కరించినట్లు అక్కడి రికార్డులే చెబుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో వందకు పైగా ములాఖత్‌లు, 50కి పైగా వివిధరంగాలకు చెందిన వారితో ములాఖత్‌లు, జైలు అధికారుల వాహనాల్లోనే బైటకు వెళ్లిరావడం సమాచార హక్కు చట్టం కింద వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల జైలు శిక్షను పునఃపరిశీలించాలని శశికళ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉండగా, జైల్లో లగ్జరీ జీవితం కోసం రూ.15 కోట్ల వరకు ఖర్చుచేసినట్లుగా జరుగుతున్న ప్రచారం చిన్నమ్మను మరింత చిక్కులో పడేసింది. శశికళను రాజకీయంగా అణిచివేయాలని కొందరు వ్యక్తులు పన్నుతున్న కుట్రల ఫలితంగా ఆమె మెడపై అనేక సమస్యల కత్తులు వేలాడుతున్నాయి. అంతేగాక సదరు ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం విచారణ అధికారిని నియమించడం, తన వద్ద వీడియోలతో కూడిన ఆధారాలు ఉన్నాయని డీఐజీ రూప ప్రకటించడం శశికళను, ఆమెకు సహకరించిన వారికి వణుకు పుట్టిస్తోంది.

సీబీఐ విచారణ జరపాలి: దీప
శశికళపై డీఐజీ రూప చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని అన్నాడీఎంకే జే దీప వర్గం (ఎంజీఆర్‌ అమ్మ దీప పేరవై) ప్రధాన కార్యదర్శి దీప శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సందర్భం వచ్చినçప్పుడు కర్ణాటక సీఎంను కలుసుకుంటానని ఆమె తెలిపారు.

మరిన్ని వార్తలు